పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరులు తమ్మెడఁబాసినది మొదలుకొని నేటివఱకును జరిగిన వృత్తాం తమును సవిస్తరముగాఁ జెప్పుమని రుక్మిణి నడిగిరి. రుక్మిణి యీ ప్రకారముగా వినిపింప నారంభించెను:

"మనలను దొంగలు కొట్టిననాఁడు రాత్రి పిండి యారబోసినట్లు తెల్లగా వెన్నెల కాయుచుండఁగా నాకు మెలఁకువ వచ్చి చూతును గదా కటికి నేలను మహారణ్యమధ్యమునఁ బడియుంటిని; నలుదిక్కుల నెంతవరకుఁ జూచిన నెందు నెవ్వరును గనఁ గనఁబడలేదు; ఎక్కడను మనుష్యనంచారము కనబడలేదుగాని మృగములయెుక్కకూఁతలు మాత్రము చెవిలో వినఁబడసాగెను. ఇంతలో నొక వ్యాఘ్రము నా దగ్గరనుండియే పోయినది కాని నన్నుఁ జూడక చేరువ నున్న యొక మనుష్యుని మొండెము నీడ్చుకొని తొలగిపోయెను. దానిని చూచినతోడనే నా దేహము నాకు స్వాధీనము కాలేదు. కొంత తెలివివచ్చిన తరువాత మీరెవ్వరును లేకపోవుట చూచి, బ్రతికియున్న యెడల మీరు నన్నొంటిగా దిగవిడిచిపోరను నమ్మకమున మీరందఱును దొంగలచేత మరణము నొంది యుందురనియు ఘాతుక మృగము లేవియో మీ దేహముల నీడ్చుకొనిపోయి యుండవచ్చు ననియుఁ దలపోసి, చూడఁ జుట్టమును మ్రొక్క దైవమును గానక చావ నిశ్చయించుకొని, మరల నింతలో నాత్మహత్య దోష మనుబుద్ధి యొకటి పట్టుటచే కొంత జంకి మీలో నెవరయినను బ్రతికి యుండ వచ్చుననియు నొకవేళ మిమ్మందరను మరల జూచు భాగ్యము కలిగి నను కలుగవచ్చుననియు నూహ చేసి మరణప్రయత్నమును మాను కొని, లేచి నాలుగడుగులు నడచితిని, ఆక్కడ నెత్తుట దోఁగియున్న శిరస్సొకటియు దాని ప్రక్కను బట్టలమూటయుఁ గనఁబడఁగా, అంతటి యాపదలో సహితము దుర్వారమయిన తద్బాధకు సహింప లేక తినుటకందులో నేమయిన దొరకవచ్చునని యా మూటను విప్పి చూచితిని; అందు పురుషులు ధరించుకోదగిన వస్త్రాదులు మాత్ర మున్నవి. వానిని చూచినతోడనే చక్కని స్త్రీలు నిజవేషములతో వొంటరిగా దిరుగుట క్షేమకరము కాదు కాఁబట్టి పురుషవేషము వేసి