భటులు కోయవానిని కొట్టినందున వాడు తక్కిన వారుండు స్థలమును జూపఁగా వారిని సహితము పట్టుకొని మమ్మందఱను రాజుగారియొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన మమ్మందఱను చెఱసాలయందుఁ బెట్టించెను; మా కందఱకు శిక్ష కలిగినను మేమీ రాజు పేరు చెప్పినవారము కాము కాబట్టి మమ్మీతఁడు చెఱసాలలో స్వేచ్చగా తిరుగుట కంగీ కరించి మిక్కిలి ప్రేమతో జూచుచున్నాడు.
రాజ__అట్లయిన శోభనాద్రిరాజు మీ కెంతో యుపకారమే చేయుచున్నాఁడు.
పాప__ఏమి యుపకారము? ఈ దుర్మార్గుని మూలమున చెఱసాలలో బడి బాధపడుచున్నాను. రాజుగా రెప్పుడో యాతని దురార్గతను దెలిసికొని యాతనిని కూడ మాకు సహాయునిగా నిందే యుంతురు. అటుపిమ్మట మఱియొక కారాగృహాధికారి వచ్చినప్పుడు మాపాట్లు దైవమునకుఁ దెలియగలవు.
రాజ__మీ కొమారునకు పిల్లనియ్యనందునకే సుమీ నన్నితఁ డిందు బెట్టించినాఁడు.
పాప__అవును. నేనెఱుఁగుదును.మీరు రాజు దగ్గఱ నుండగా పద్మరాజును పిలిపించినప్పడు వాఁడు నా వద్దనే యున్నాడు. అది యంతయు నేనును మావాఁడును రాజును సిద్ధాంతియుఁ గలిసి చేసిన యాలోచనయే అయినను మీ దినములుబాగుండి మా యాలోచన కొన సాగినదికాదు. శోభనాద్రిరా జెక్కడికోగాని నాతోఁగూడ నల్లచెఱువు వద్ద నుండిన వాండ్ర నిద్దఱిని సంకిళ్ళూడదీయించి పంపదలఁచు కొన్నాఁడు.
రాజ__ఎక్కడకో మీకుఁ దెలియలేదా?
పాప__తెలియలేదు. ప్రొద్దున నాతో నేమో యాలోచించుటకు వచ్చినప్పుడు రాజుగారి తమ్ముఁ డిక్కడకు వచ్చినందున రాత్రి చెప్పెదనవి వెళ్ళిపోయినాఁడు. నేను మీకు పూర్వము గొప్ప యపకారము చేసితిని; దానికి మాఱుగా నిప్పు డుపకారము నొకదానిని జేసెదను. పెద్దాపురపు రాజుగారు బహు యోగ్యులు: శోభనాద్రిరాజు