రెండవ కొమార్తె. ఈ చిన్నదియు నేనును నీమె యన్నగారును నన్యోన్యమును సోదర భావమును నుండెడివారము: అందులో ముఖ్య ముగా నీ చిన్నదాని యప్పగారును నేనును తానే నే నన్నట్లు భేదము లేక యుండెడివారము. ఈ చిన్నది నన్ను మఱచిపోయినట్లున్నది.
రామ__ఈ చిన్నదాని తలిదండ్రు లిప్పుడు భీమవరములో నున్నారు. వారివలన మీరంత యుపకారమును పొందియున్నయెడల, ఈ చిన్నదానిని గొనిపోయి జననీ జనకులకడఁ జేర్చి వత్తము, దారి తోడుగా వచ్చెదరా?
సుబ్ర__ఆవశ్యముగా వచ్చెదను. నేను లోపలికిఁబోయి యీ సంగతిని మా వాండ్రతోఁ జెప్పి వచ్చువఱకును నిమిష మిక్కడ నిలువుండి.
ఆని సుబ్బరాయఁడు లోపలికిఁబోయి యింటివారితో సంగతి యంతయుఁ జెప్పి మా చిన్నదానిని భీమవరములో దిగబెట్టి సాధ్యమయినంత శీఘ్రముగానే తిరిగి వచ్చెదనని చెప్పెను. వారు వలదని యనేక విధములఁ జెప్పినను విననందున వారందఱును వీధి గుమ్మము వరకును వచ్చి 'నాయనా! వేగిరము రావలెను జుమీ!' యని మఱిమఱి చెప్పిరి. రామరాజాచిన్న వాని సౌందర్యమున కాశ్చ ర్యపడుచు, ఇంతటి చక్కదనము స్త్రీలయందుండిన నెంత రాణించునని తనలోదాను తలపోయుచుండెను. అతఁడు వచ్చిన తోడనే రామరా జాచిన్నదానిని బుజముమీఁద నెత్తుకొని సుబ్బరాయ నితో మాటాడుచు భీమవరము మార్గముపట్టి నడవనారంభించెను.
రామ__మీరు బ్రాహ్మణు లయ్యును, ఆ ప్రకారముగా తల పెంచుకొన్నారేమి?
సుబ్బ__వెంకటేశ్వరులకు మొక్కున్నది. ఆ మొక్కును బట్టియే తొడుగుకొన్న యంగీ మొదలగు వస్త్రములను భోజనము చేయునప్పుడు సహితము తీయకుందును; బట్టలు మాసినప్పుడు సహితము రెండవవా రెఱుఁగకుండ మహారహస్యముగా నొక గదిలో నుతికిన బట్టలను కట్టుకొనుచుందును. ఈ వ్రతము నేఁటివఱకు దైవానుగ్రహమువలన సాగివచ్చుచున్నది.