పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండ్రెండవ ప్రకరణము

రామరాజు సాయమున సుబ్బరాయఁడు సీతను వెంటఁబెట్టుకొని వచ్చుట__రామరాజు చెఱసాలలో రాజశేఖరుడుగారిని చూచుట__రాజశేఖరుఁడు గారి కారాబంధవిమోచనము__ శోభనాద్రి రాజును శిక్షించుట__సుబ్బరాయఁడు రుక్మిణియయి తన వృత్తాంతమును చెప్పుట.

పెద్దాపురమునకు అయిదారుక్రోసుల దూరములో జగ్గమపేట యను గ్రామమొకటి కలదు. సీత నెత్తుకొని పోయిననాఁడు మధ్యాహ్నము రెండు జాములవేళ గ్రామకరణముయొక్క యింటివద్ద కెవ్వరో వచ్చి తలుపు తీయమని కేకలు వేసిరి. అప్పుడు పదునాలుగు సంవత్సరముల ప్రాయముగలిగి మిక్కిలి యందగాఁడై యేహేతువు చేతనో తలపెంచుకునియున్న చిన్నవాఁ డొకఁడు లోపలనుండి వచ్చి తలుపుతీసి యెందుకు వచ్చినారని యడిగెను. ఆక్కడ నిలుచుండి యున్న యిద్దరు మనుష్యులలో నొకఁడు "బ్రాహ్మణ కన్యకకు డబ్బు పుచ్చుకొని యన్నము పెట్టెదరా" యని యడిగెను. ఆ చిన్నవాఁడు వెలుపలికి వచ్చి చూచునప్పటికి, ఎనిమిదేండ్ల యీడుగల యొక చిన్నది యరుగుమీఁదఁ గూరుచుండి క్రిందు చూచుచు వెక్కివెక్కి యేడ్చుచుండెను. ఆ మనుష్యులలో నొకఁడు చేరువ నిలుచుండి యూరకుండుమని యదలించుచుండెను. ఆ చిన్నవాఁ డట్లు వెలుపలికి వచ్చి తమ మొగమువంకఁ దేఱిపాఱఁ చూచుచుండుటఁగని ఆ మనుష్యు లిద్దఱును మీ పేరేమని యడిగిరి. ఆతఁడు సుబ్బరాయఁడని చెప్పి, యా చిన్నదాని మొగమును నిదానించి కొంచెముసేపు చూచి యిట్లనియెను;