ఈ పుట ఆమోదించబడ్డది
వారి కందరకు సుబ్రహ్మణ్యమును నాయకునిగాఁ జేసి విచారణకయి పెద్దాపురము కృష్ణజగపతిమహారాజుగారికడకుఁ బంపెను. సుబ్రహ్మ ణ్యమును ఉమాపతిగారియొద్ద సెలవు పుచ్చుకొని పెద్దాపురమునకు ప్రయాణమయి బయలుదేరి వీధి గుమ్మము వద్దకు వచ్చునప్పటికి పైనుండి మాలబల్లి యొకటి మీఁద పడెను. అప్పుడు ప్రయాణమాపి గౌళిపాటుయొక్క ఫలము కనుగొనుటమ పురోహితునకు వర్త మానము పంపఁగా నతఁడు తాటాకుల పంచాంగమును పట్టుకొని వచ్చి శిరస్సుమీఁద పడలేదు గనుక మరణ భయము లేదనియు స్నానముజేసి దీపము పెట్టుకొని బ్రాహ్మణునకు కొంచెము సువర్ణ దానము చేసిన పక్షమున బల్లి పాటుయొక్క దోషము పోవుననియుఁ జెప్పెను. సుబ్రహ్మణ్యము వెంటనే శిరస్నానము చేసివచ్చి రాగిలో సువర్ణముండునుగనుక నాలుగుడబ్బు లాబ్రాహ్మణుని చేతిలోనే పెట్టి గాయిత్రి చేసికొని తరువాత నెంతో యెండయెక్కినను ఆ పూటనే పెద్దాపురమునకు వెళ్ళ బయలుదేఱెను.