పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతఁడట్లడుగుటకు కారణమేమి? ఈ దొంగతనములో నతనికేదో సంబంధము గలిగియుండవలెను. అతఁడు గోడయెత్తు కూడ నడిగెను. దొంగతనములో సంబంధమే లేనియెడల గోడయెత్తుతో నితని కెమి ప్రయోజనము? అంతియకాక యీ సంగతి గ్రామములో పొక్కక మునుపే వేకువజామున బహిర్భూమికి వెళ్ళచుండఁగా నన్నుఁబిలిచి యతఁడు రాజుగారిలోపల దొంగలు పడ్డారcట యని యడిగినాఁడు; ఆతఁడు దొంగలలోఁ జేరియుండని పక్షమున, అంత పెందలకడ నాతని కాసంగతి యెట్లు తెలియును? నేను సాయంకాల మింటికి వచ్చునప్పుడు వీధిలో నిలుచుండఁగా నాతనిని జూచినాను: అప్పు డాతని చర్య వింతగా నున్నది. ఈ యన్ని హేతువులచేతను విచారించిచూడగా ఈతడు దొంగల గురువనుటకు సందేహము లేదు. రేపు రాజుగారి నడిగి కొందఱు రాజభటులను బుచ్చుకొని యెవ్వరికిని తెలియకుండ నాతని యింటిమీద పడి పెట్టెలు మొదలగునవి పరీక్షించెదను. అప్పుడు కొంత సొమ్మయిన దొరకఁ గలదు. అందు మీఁద నామీఁది నిందయైనను పోపును" అని యాలోచించి యారాత్రి యెట్లో వేగించి తెల్లవారినతోడనే రాజుగారి దర్శనముచేసి తన యందు దోషము లేశమయినను లేదని చెప్పుకొని తన వశమునఁ గొందఱు భటులనిచ్చి తనయాజ్ఞాప్రకారముచేయ ను త్తరువిచ్చినచో దొంగలను సొత్తుతో గూడఁ బట్టుకొనెదనని దృడముగాఁ జెప్పెను. రాజుగారాతని మాటయందు గౌరవముంచి, తక్షణమే పదుగురు భటులను రప్పించి "మీరందఱు నీయన చెప్పినట్లెల్లచేసి పర్యవ సానము మాతో మనవి చేయవలసినదని గట్టి యుత్తరువు చేసిరి. సుబ్రహ్మణ్యము వారిని దీసికొని తిన్నగా నీలాద్రిరాజున్న యింటికిఁ బోయి వీధి తలుపు వేసియుండగా వారినందఱిని, ఇంటిచుట్టును కావలిపెట్టి యిద్దఱిని వెంటఁదీసికొని పాణిద్వారమున దొడ్డిలో ప్రవేశించెను. ఆప్పుడు నీలాద్రిరాజు పెరటిలో నిలుచుండి క్రొత్త మనుష్యులు వచ్చుట చూచి తత్తరపడసాగెను.