పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫలప్రదములఁ గావించుచు తన చల్లదనము వ్యాపించినంత వఱకు నిరుపార్శ్వములందును భూమినంతను బచ్చని లేఁబచ్చికతో నలంకరించి పశుగణంబుల కాహారంబు కల్పించుచు, తనరాక విని దూర మునుండి బయలుదేఱి యడవిపండ్లను నెమలికన్నులును వహించి పొంగి నానా ముఖములఁ దన్నుఁ గానవచ్చు వరద, మంజీర, పిన్న గంగ మొదలగువారి నాదరించి లోఁగొనుచు, అంతకంతకుఁ దన గంభీరత గానుపింప నాధుని వెదకి కొనుచు వచ్చివచ్చి, యేగిరిని దూరమునుండి విలోకించి గోదావరి రసోత్తరంగముగా ఘోషించుచు పాదమునంబడి శిఖరంబున నధివసించు జనార్ధనస్వామి దర్శనము చేసుకొని తోడనే యచ్చటనుండి తనశాఖారూపము లయిన రెండు చేతులను జాచి సరసతమీఱ నాధునిం గలియు భాగ్యము గాంచెనో యా ధవళగిరి, యాంధ్రదేశమున కలంకారభూతమయి రాజమహేంద్ర వరపుర సమీపమున మిక్కిలి వన్నెకెక్కి యుండెను.

ఆ పర్వత మంతయున్నతమయినది కాకపోయినను, తెల్లని పిండి రాళ్ళతో నిండి యుండుటచేఁ జూచుట కెంతయు వింతగా మాత్ర ముండును; ఆ రాళ్ళనుబట్టియే దానికి ధవళగిరి యను నామము కలిగి యుండును. దక్షిణపువై పునఁ గ్రిందినుండి పర్వతాగ్రమువఱకును నల్లరాళ్ళతోఁ జక్కనిసోపానములు కట్టబడియున్నవి. ఆ సోపానముల కిరుప్రక్కలను కొండపొడుగున నర్చకులయుఁ దదితరులగు వైష్ణవ స్వాములయు గృహములు చాలుగానుండి కన్నులపండువు చేయు చుండును. ఆ సోపానముల వెంబడిని బైకిఁ జనినచో గొండమీఁద నల్లరాళ్ళతోఁ గట్టఁబడిన సుందరమైన చిన్నదేవాలయ మొక్కటి కానఁబడును. దాని చుట్టును నించుమించుగా నిలువెడెత్తు ప్రాకారము మూఁడు ప్రక్కలను బలిసియుండును. ఉత్తరపు వైపునమాత్రము గోడకు బదులుగా పర్వతశృంగమే పైకి వ్యాపించి, గోడలు తన పాదము నాశ్రయింప వానిని మించి యాలయశిఖరమును నిక్కి చూచుచుండును. ప్రాకారములోపలనె యుత్తరమున నొక చిన్న గుహ కలదు. అందులోఁగూర్చుండి పాండవులు పూర్వమరణ్యా వాసము చేయునప్పుడు తపస్సు చేసిరని పెద్దలు చెప్పుదురు. అందులో

14