పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని వెళ్ళిపోవుచుండఁగా, శోభనాద్రిరాజు తన భటులచేత రాజశేఖ రుఁడుగారిని పట్టి తెప్పించి చెఱసాలలోఁ బెట్టించెను. ఆ సంగతి మాణిక్యాంబకు తెలిసినది మొదలుకొని పెనిమిటికి సంభవించిన యాపదను దలంచుకొని నిద్రాహారములు మాని సదా యీశ్వర ధ్యానము చేయుచు లోలోపల దుఃఖించి కృశించుచుండెను.

ఈ సంగతి జరిగిన మూడవనాఁడు సూర్యోదయమయిన తరువాత సీత వీధిగుమ్మములో నిలుచుండఁగా నెవ్వరో యిద్దరు మను ష్యులు వచ్చి, "మీయన్నగారు పిఠాపురమునుండి వచ్చి యావలి వీధిని కరణముగారి యింటిలోఁ గూరుచుండి నిన్నక్కడకు దీసికొని రమ్మ న్నాఁడు"అనిచెప్పి సీతను దీసికొనిపోయి యూరుబయటనుండి యెత్తు కొని పారిపోయిరి. ఈ దుఃఖవార్త మాణిక్యాంబకుఁ దెలిసినతోడనే భూమిమీఁదపడి మూర్చపోయి కొంతసేపటికిదెలిపి పెనిమిటియొక్కవియోగమునకుఁ బుత్రికాశోకము తోడుపడ నెవ్వరెన్నివిధములఁ జెప్పినను మానక కన్నీరు కాలువలుగట్ట విలపించుచుండెను.