పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బయలుదేరునపుడు మంచి ముహూర్తము పెట్టుకొని యిల్లు బయలు దేరినను త్రోవలో గొప్పయాపదలు వచ్చినవి;అందుచేత జ్యొతిషము మీఁది నమ్మకము చెడినది. కాబట్టియే మొన్న పెద్దాపురమునుండి యిక్కడకు వచ్చునపుడు ముహూర్తము చూచుకొనకయే బయలు దేఱినాను.

సుబ్బ__నాది అందఱి జ్యోతిషములవంటిది కాదు;నేను చెప్పిన బ్రశ్నకాని పెట్టిన ముహూర్తముకాని యీ వరకెన్నడును తప్పిపోలేదు; నేను జాతకములో నెన్నియక్షరములు వ్రాయుదునో యన్ని యక్షరములును జరిగి తీరవలెను.

రాజ__మీరు చెప్పెడు ఫలము నిజమైనను నాకక్కరలేదు. నాకు ముందు మేలుకలుగుననెడి పక్షమున, వచ్చెడు ననుకొన్నది రాక పోయెనేని మిక్కిలి వ్యసనముగా నుండును; నిజముగా వచ్చెనేని ఆవఱకే దాని నెదురు చూచియుండుటఁజేసి వచ్చినప్పు డధిక సంతో షము కలుగదు. కీడు కలుగునని చెప్పెడు పక్షమున నిజముగా వచ్చి నప్పుడు దుఃఖపడుట యటుండఁగా ఇప్పటినుండియు విచారపడవలసి వచ్చును; ఒకవేళ రాకపోయెడు పక్షమున వ్యర్ధముగా లేనిపోని చింత పడవలసి వచ్చును; ఆ వట్టి విచారముచేతనే కీడు కలిగినను గలుగ వచ్చునుగాని, సంతోషపడుటచేత మేలు మాత్రము కలుగనేరదు.

సుబ్బ__పండితులై యుండియు మీరాలాగున సెలవిచ్చుట భావ్యము కాదు. పెద్దలు చెప్పిన శాస్త్రములయందు మనమెప్పడు గుఱి యుంచవలెను. ఆ మాట పోనిండి. మీ కుమార్తెకు పెండ్లి యీడు వచ్చినట్టున్నది; ఇంకను వివాహ ప్రయత్నము చేయక యశ్రద్ధగా నున్నారేమి?

రాజ__ఆ విషయమైయే నేనును విచారించుచున్నాను. అను కూలమయిన సంబంధము కనఁబడలేదు; చేతిలో సొమ్ము సహితము కనఁబడదు. మీ ఎఱుక నెక్కడనై నను మంచి సంబంధము లేదు గదా?

సుబ్బ__సం-బం-ధ-మా? ఉన్నదికాని, వారు గొప్పవారు;