పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోడలే పొట్టివి గనుక గుమ్మము లంతకన్నను పొట్టివిగా నుండెను. కాఁబట్టి ఎక్కడను వంగి నడవనివారు సహితమక్కడ వంగి నడచు చుందురు; లోపలిగోడ లెత్తుగా నుండకపోయినను దొంగలభయము చేతఁగాబోలును గాలి వచ్చుటకు వలనపడకుండ దొడ్డిచుట్టును నున్న గోడలు మాత్రము మిక్కిలి యెత్తుగాఁ బెట్టబడినవి. కాని యింటివా రాయిల్లు విడిచిపెట్టి వెళ్ళినతరువాత చూచువారు లేక కూలి యిప్పుడు మొండిగోడలుగా నున్నందున లోపలికి గాలి వచ్చుట కవకాశము కలిగినది. పూర్వ మిల్లుగలవా రందున్నప్పు డెవ్వరో యొకరు సదా రోగబాధితులైయుండుచు వచ్చినందునను గృహాధిపతియెుక్క కూఁతు రందులోనే పోయినందునను ఆ యిల్లచ్చిరాలేదనియు దానిలో నేదో గ్రహమున్నదనియు నెంచి దానిని విడిచి మఱియొకచోటికిఁ బోవ యత్నించుచుండిరి. కూతురుఁపోయిన నక్షత్రము ధనిష్టా పంచక ములో నొకటైనందున బ్రాహ్మణుఁ డాఱునెలల వఱకు ఆ యింటిని పాడుపఱిచి తరువాత సహితము పిల్లలతో నందుండుటకు మన సొప్పక వేఱొక యిల్లు కట్టుకొని యందు కాపురముండెను. రాజశేఖ రుఁడుగా రాయింటిలోఁ బ్రవేశించినతరువాత కొన్ని గవాక్షముల నెత్తించి గాలివీలు కలిగించుకొనుటయేగాక, తేమ పోవునట్టుగా యిల్లెత్తు చేయించి, వంటకు ప్రత్యేకముగా దూరమున దొడ్డిలో నొక పాక వేయించిరి. ఈ కర్చులక్రిందను భోజనాదికముక్రిందను తెచ్చు కొన్న రూపాయలు వ్యయపడుచుండెను. కాఁబట్టి రెండు మూడు మాసములలోనే జీవనమున కిబ్బంది కలుగునట్టు కనఁబడుచుండెను.

అదియొక పల్లె గనుక భీమవరములో కొనుటకు పాలు, మజ్జిగలుకాని, కట్టెలుకాని దొరకవు; పాడిగలవారికి చిట్టును పొట్టును యిచ్చిన యెడల వారింత పలచని మజ్జిగ పోయుచుందురు. రాజశేఖ రుఁడుగారు ప్రతి భానువారమునాడును పెద్దాపురమునకుఁ బోయి సంతలో వారమునకుఁ సరిపడిన వస్తువుల నన్నిటిని కొని తెప్పించు కొనుచుందురు. నెలదినములు గ్రామములో కాపురముండునప్పటికి రాజశేఖరుఁడుగారికి పలువురు పరిచితులుగా నేర్పడిరి. వారాయన స్థితి