పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గారును మాణిక్యాంబయు విసిగిపోయిరి. వారందఱు నట్లు పనికట్టు కొని వచ్చి ప్రశ్నలు వేయుటకయి ముందడుగిడుచువచ్చినను, రాజ శేఖరుఁడుగారు తమకు బస కావలెనని యడుగఁబోగానే తిన్నగా వినుపించుకోక, లేదని వెనుకంజ వేయ నారంభించిరి.అంతట రాజశేఖరుఁడు గారు బండిని వీధిలో నిలిపించి, తాము బయలుదేఱి బస నిమి_త్త మయి యెల్లవారింటికిని బోయి రెండు జాములవఱకు నడుగుచుండిరి గాని, వారిలో నొక్కరును ఆ పూఁట వండుకొని తినుటకయినను స్థలము నిచ్చినవారుకారు. క్రొత్తగా వచ్చినవారు గనుక రాజశేఖరుఁడు గారు బస నిమిత్తమయి తిరుగునప్పుడు వీథులలో నిలువచేయబడియున్న పెంటకుప్పలను జూచి యసహ్యపడుచు వచ్చిరిగాని ఎరు వున కుపయోగించుటకయి పొరుగూళ్ళకు సహితము గొనిపోయి యమ్ముకొనెడి యా యూరివారి కవియే కనకమన్న సంగతిని తెలిసికో లేకపోయిరి. అట్లా దుర్గంధమునకు ముక్కు మూసికొని నడచి గ్రామ కరణముయొక్క యింటికిఁబోయి వారి యింటిపేరడిగి యేదో యొక ప్రాతబంధుత్వమును తెలుపుకొని మొగమోటపెట్టఁగా ఆతఁడాపూటకు తమ యింట వంట చేసికొనుట కంగీకరించి, పొరుగుననున్న యొక వైదిక బ్రాహ్మణుని పిలిపించి రాజశేఖరుఁడుగారు కాపర ముండుట కయి వారి ప్రాత యిల్లిమ్మని చెప్పెను. అతఁడాయిల్లు బాగు చేయిం చినఁగాని కాపురమున కక్కరకు రాఁదనియు, తన భార్య సమ్మతిలేక యియ్య వలనుపడదనియు, పెక్కుప్రతిబంధములను జెప్పెను; కాని రాజశేఖరుడుగా రాతనిని కూరుచుండఁబెట్టుకొని పరోపకారమును గూర్చి రెండు గడియలసేపు ఉపన్యాసము చేసి యిల్లు బాగుచేయించుట పేరుచెప్పి రెండు రూపాయలు చేతిలోఁబెట్టిన సొమ్మాతనిని నిమిష ములో సమాధానపఱచినది. కాఁబట్టి రాజశేఖరుఁడుగారు వెంటనే పోయి బండిని తోలించుకొనివచ్చి యా పూట కరణము లోపల వంట చేసికొని భోజనముచేసి దీపముల వేళ సకుటుంబముగా ఆ గ్రామ పురోహితులయింట బ్రవేశించిరి. ఆ యిల్లు పల్లపునేలయందుఁ గట్టఁబడి యున్నది; గవాక్షములు బొత్తిగా లేనేలేవు; వాస్తుశాస్త్రప్రకారముగా దూలములు యజమానుని చేతికందులాగునఁ గట్టబడిన యా యింటి