పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చినపుడు పుణ్యలోకము వచ్చుటకు తగిన సదుపాయమును చేసి పదిరూపాయలను పట్టుకొని పోయినారు ఆ మఱునాఁడే దొంగవస్తు వొకటి ఆయన యధీనములో కనబడిన యన దుర్మార్గులయిన రాజ భటు లాయనను నిష్కారణముగా తీసుకొనిపోయి ఠాణాలో పెట్టినారు.

రాజ__గురువు లెప్పుడును శిష్యులకుఁ దమవ్రేలితో స్వర్గము నకు త్రోవ చూపుచుందురు. కాని తాముమాత్రము స్వర్గమార్గము మాట యటుండఁగా దామున్న యీ లోకమునే త్రోవఁగానక గోతిలో పడుచుందురు. తార్కికుఁడును వైయాకరణుఁడును నగుట సులభము కాని యోగ్యుఁ డగుట యంతసులభము కాదు. ఆ మాట యటుండ నిచ్చి మీ పట్టణములోని వారి స్థితిగతులను కొంచెము చెప్పుము.

సత్ర__కష్టపడి పనిచేయువారు తాము తెచ్చుకొన్నది అన్న వస్త్రాదులకు చాలక బాధపడుచుందురు! పాటుపడని సోమరిపోతుల పూర్వులార్జించిన మాన్యముల ననుభవించుచు విలువబట్టలను పంచ భక్ష్యపరమాన్నములను గలిగి సుఖింపుచుందురు. తాతముత్తాతల నాటినుండియు పరువుతో బ్రతికినవారు కొందఱు జీవనము జరగక రాజుగారిని చిరకాలము నుండియు యాశ్రయించుచున్నారు; కాని యెంత యనుసరించినను రాజు నిర్ణయుఁడై చదువురాదని చెప్పి వారికి కాలువ లియ్యకున్నాఁడు.

రాజ__ఆదృష్టవంతులము కావలెనని చేయు ప్రయత్న మొకటి తప్ప వేఱుప్రయత్నము లేనివా రెప్పడును భాగ్యవంతులు కారు. భాగ్యదేవత మాఱుపని లేక తనకొఱకే కాచుకొనియున్న వారియొద్ద నుండి పాఱిపోయి యింట గూరుచుండి యొడలు వంచి పనిచేయువారినే చేరును. దాని కేమిగాని మిగిలిన వృత్తాంతమును చెప్పము.

సత్ర__మా పట్టణమున ననేకులు రాత్రులు పురాణ కాలక్షేప మును జేయుదురు. ఇక్కడకు దగ్గఱనే యొక పెద్ద మనుష్యుఁ డున్నాఁడు. ఆయన యెప్పుడును చదువక పోయినను తాటాకుల