పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండిరి. వారు నాగరికులు గనుక వారి ప్రసంగ మెంత మనో హరముగా నుండునో విని యానందింపవలెనని తలచి రాజశేఖరుఁడు గారు వీధిలోనే నిలువఁబడి వినుచుండిరి. ఆ సభికులందఱును తామై నను పొగడుకొనుచుండిరీ; లేదా స్నేహితులు పొగడుటకు సంతోష మైనను బొందుచుండిరి; వారందఱు నట్లానందించుచుండఁగా రాజ శేఖరుఁడుగారు తన్నెవరును పొగడువారును పొగడుకొన్న విను వారును గూడ లేనందునఁ జిన్నఁబోయి యిఁకనిందు నిలువఁగూడ దనుకొని యక్కడనుండి బయలుదేఱిరి. అటుపిమ్మట నాతఁడు త్రోవపొడుగునను నాలుగైదు రమణీయ సౌధములను జూచి లోప లికిఁబోయి వానిని చూడవలెనని బుద్దిపుట్టి గుమ్మమెక్కి తాను పండి తుఁడననియు మేడనుచూచి వేడుకపడి వచ్చితిననియుఁ జెప్పి చూచెను గాని ఆ పట్టణస్థులందఱును ధనికులమీఁద మాత్రమే ప్రేమ గలవారు గనుక ఆయన పాండిత్యమేమియు పనికిరాక మేడల యొక్క వెలు పటిభాగములను మాత్రము చూచి సూర్యాస్తమయ సమయము కావచ్చి నందున వెనుక మరలి తిన్నగా సత్రమువద్దకు వచ్చి చేరవలసివచ్చెను.

అప్పుడు సత్రపు బ్రాహ్మణుఁడు రాత్రి వంటలేదు గనుక తీఱు బడిగా వచ్చి కూరుచుండి రాజశేఖరుఁడుగారితో ముచ్చటలకు మొదలు పెప్టెను.

రాజ__మీ పట్టణములో గొప్ప పండితు లున్నారా?

సత్ర__ఉన్నారు. ఆస్థాన పండితుఁడయిన హరి పాపయ్య శాస్త్రులుగారు లేరా? ఆయన యెప్పడు నెవ్వరితోను బ్రసంగింపఁడు గనుక అందఱికంటెను గొప్ప పండితుఁడని వాడుక. ఆయన యొక సారి యాసత్రములో జరిగిన సంతర్పణమునకు భోజనమునకు వచ్చి నప్పుడు విశేషముగా మాటాడకపోయినను విశేషముగా భుజించి నందున, ఆయన గొప్ప పండితుఁడనియే నేనును నమ్మినాను.

రాజ__ఆయనగాక మఱియెవ్వరయిన నున్నారా?

సత్ర__మా గురువులు భానుమూర్తిగారు వేదాంత శాస్త్ర మందు నిరుపమాన మయిన ప్రజ్ఞ గలవాఁడు. నాకు మొన్న రోగము