సత్ర__అతఁడే యీ తంతు నడిపించుచున్న మంత్రజ్ఞుడు; క్రొత్తగా వచ్చి యిండ్లు కాల్చుచున్న దేవతను కొంచెముసేపటికి వెళ్ళగొట్టును. అతని పేరు వీరదాసు.
సుబ్ర__ఈవఱ కేమి తంతు చేసినారు?
సత్ర__ఇంటికొకటికి రెండేసిచేరల బియ్యము చొప్పున ఏడిండ్లలో అడిగి పుచ్చుకొని,క్రొత్తకుండ తెప్పించి గ్రామము నడుమ వీధిలో పొయ్యిపెట్టి ఆ కుండలో అడిగి పుచ్చుకొన్న బియ్యము, మునగకూర, తెలగపిండి కలిపి జామువఱకు వంట చేసి, ఆ కుండను దిగువ దించియుంచి నడివీధి నలికి యెఱ్ఱమ్రుగ్గు, తెల్ల మ్రుగ్గు, నల్లమ్రుగ్గు, పచ్చమ్రుగ్గు, ఆకుపసరుమ్రుగ్గు తెచ్చి వానితో భేతాళుని స్వరూపము వ్రాసి, భేతాళయంత్రము వేసే పూజచేసి ధూప దీప ఫలనైవేద్యములు సమర్పించి ఏడేసి రావియాకులతో కుట్టిన యేడు విస్తళ్ళలో వండిన కుంభమును వడ్డించి, నడివీధిలో నొక కొయ్యను పాతి దానికి భేతాళ యంత్రమునకు గ్రహమును వ్రాసిన యాజ్ఞనుగట్టి, ఈయన జరిగించవలసిన పని యంతయు జరపినాఁడు. తరువాత మేము కుంభమును బండిలో నెత్తించుకొని యీ కట్టలతో గృహములమీఁద కొట్టుచు ఊరేగుచున్నాము. ఇక గ్రామదేవత గుడివద్దకు వెళ్ళినతరువాత చిత్రము జరుగును.
సుబ్ర__అలాగయిన నేనును వచ్చెదను.
అని సుబ్రహ్మణ్యము వారివెంటఁ బయలుదేఱెను. అందఱును గ్రామదేవతగుడి చేరినతరువాత యంత్రజ్ఞుఁడు బిగ్గరగా గ్రామదేవత పేర వ్రాసిన యాజ్ఞను ఈ ప్రకారముగాఁ జదివెను:
"యంత్రజ్ఞుఁడైన వీరదాసుగారు పెద్దాపురము గ్రామదేవత అయిన మరిడీమహలక్ష్మికి చేసిన యాజ్ఞ-ఈ గ్రామములో ఏదో గ్రహముచేరి యిండ్ల కాల్చుచుండఁగా ఈ గ్రామమునకు దేవతవయి యండియు నీ వూరకే చూచుచుండుటకు నిమిత్తము లేదు. ఆ గ్రహ మునకు నీ తరపున కుంభము కట్టుబడి చేయించినాము. ఆ కుంభము ఆ గ్రహమున కిచ్చి మాఱుమన్యమైన కొండలమీఁదికి దానిని పంపి