చూచి యామె చచ్చినదనియే స్థిరపరచెను. అప్పడందఱును శవము చుట్టును జేరి విలపించుచుండిరి. ఆ సమయమున సమీపమున నుండి వ్యాఘ్రముయొక్క కూఁత యొకటి వినఁబడెను. అంత యాపదలో సహిత మాధ్వని కందఱును బెదరి వడకుఁచుండగా, రామరాజు వారికి ధైర్యము చెప్పి క్రూరమృగములతో నిండియున్న యరణ్య మధ్యమగుటచేత నచ్చట నిలువఁగూడదనియు తెల్లవారిన మీఁదట మరల వచ్చి శవమునకు దహనాది సంస్కారములు చేయవచ్చు ననియు బోధింపఁజొచ్చెను. కన్నకూతును కారడవిలో విడిచిపెట్టి వెళ్ళుటకు మనసు రాక, వారాతని మాటలను చెవినిబెట్టక రుక్మిణి సుగుణములను దలఁచుకొని యేడుచుచుండిరి. ఇంతలో మఱింత సమీపమున గాండ్రు మని పులి మఱల నఱచెను. ఆ రెండవ కూఁతతో సూర్యకిరణములకు మంచు కరఁగునట్టుగా వారి ధైర్యసారము కరఁగి పోయెను. అప్పుడా రామరాజు హితబోధ నంగీకరించి, యెంతో కష్ట ముతో రుక్మిణిని విడచిపెట్టి, నడవ కాళ్ళరాక ముందుకు నాలుగడు గులు పెట్టి మరల వెనుక తిరిగి చూచుచు, తుదకు విధిలేక రామరాజు వెంట వారందఱును పెద్దాపురమునకుఁ బోయిరీ, తమ ప్రాణముల మీఁదికి వచ్చునప్పడు లోకములో నెల్లవారును తామావఱకు ప్రాణా ధికులనుగాఁ జూచుకొనువారి యాపదలనయినను మఱచిపోయి తమ యాపదను తప్పించుకొనుటకే ప్రయత్నింతురు గదా?