పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీ ప్రకారముగా నడచునప్పుడు రాజశేఖరుఁడుగారి ప్రాణము లాయన దేహములో లేవు; తక్కినవారును అఱచేతిలో ప్రాణములు పెట్టు కొని కా ళ్ళీడ్చుచు నడచుచుండిరి. ఆ రాత్రి యాపద నుండి తిప్పించు కొని యేదైన నొకయూరు చేరితిమా యిఁక నెప్పడును దారి ప్రయాణము చేయమని యెల్లవారును నిశ్చయము చేసికొనిరి. ఊరు చేరినతరువాత గ్రామ దేవతకు మేకపోతును బలి యిప్పించెదనని మాణిక్యాంబ మ్రొక్కుకొనెను. ఈ ప్రకారముగా వ్యాకులపడుచు వారు నడిచి యొక విశాల స్థలమును జేరునప్పటికి, చింతచెట్టు క్రింద మంట ముందఱఁ గూరుచుండియున్న రెండు విగ్ర హములు లేచి, దేహమునిండ కంబళ్ళు కప్పుకొని నోటిలో చుట్ట లంటించి బుజములమీఁద దుడ్డుకఱ్ఱలతో వారివంక నడచి రానారం భించెను. వాండ్రను జూచినతోడనే వారి కందఱకును పయిప్రాణ ములు పయిని పోయినవి; వెనుకనున్న కిరాతుఁడు దొంగలని కేక వేసి వెనుకవాఁడు వెనుకనే పాఱిపోయెను. ఇంతలో నా దొంగ లలో నొకఁడు ముందుకు వచ్చి రెండుచేతులతోను కఱ్ఱను పూనిపట్టి, మాటాడక ముందున్న రుక్మిణి నెత్తిమీఁద సత్తువకొలఁది నొకపెట్టు పెట్టెను. ఆ పెట్టుతో మొదలు నఱికిన యరcటిచెట్టు వలె రుక్మిణి నేల కొఱిగి నిశ్చేష్టురాలయి పడియుండెను. ఇంతలో నెవ్వఁడో కత్తి దూసికొని ఆగు ఆగు మని కోకలు వేయుచు, మెఱుపు మెఱిసి నట్టు మీఁదఁబడి దొంగలలో నొకనిని మెడమీఁద ఖడ్గముతో వేసెను. ఆ వేటుతో శిరస్సు పుచ్చకాయవలె మీఁది కెగరి దూరముగా బడఁగా మొండెము భూమిమీఁదఁబడి చిమ్మన గొట్టములతో గొట్టి నట్లు రక్తధారలు ప్రవహింప కాళ్ళతోను, చేతులతోను విలవిల గొట్టు కొనుచుండెను. శత్రువాయుభపాణియయి యుండుటయు, తా నొంటి గాఁడగుటయు, బాటసారులలో మఱి యిద్దఱు మగవాం డ్రుండుటయు చూచి కిరాతునితోఁ గూడికొని రెండవ దొంగవాఁడు కాలికొలఁదిని దాఁటెను. ఖడ్గపాణియైన యా పుణ్యాత్ముడు వాండ్రను కొంత దూరము వెంబడించెను గాని వాండ్రు నిమిషములోఁ జూపుమేర