పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చించి సంతోషపూర్వకముగా లేచి, ఆ త్రోవలను సంకేత స్థలములను నెఱిగియున్నవాఁడు కావున మాఱుమాటాడక కత్తిని చేతఁ బట్టు కొని పాకవెడలి బయలుదేఱెను. ఆ కిరాతుఁడును అడ్డత్రోవను బోయి దారిలోఁ గనఁబడ్డ మఱియొకనితోఁగూడఁజెప్పి తిరిగి యోగిని గలిసికొని యాతని యుత్తరువు వ్రకారము విల్లును నమ్ములును ధరించి వారిని మార్గము తప్పించి చీమలచింతయెద్దకుఁ దీసికొని పోవుటకయి పరుగెత్తుకొని పోయి సంజచీఁకటి వేళ వారిని గలిసి కొనెను.

కిరా__అయ్యా! శిష్యులు రానందున మా గురువుగారు మీ కాపదలకయి నన్నుఁ బంపినారు. మంచిసమయములో వచ్చి మిమ్ముఁ గూడుకొన్నాను. దొంగలుకొట్టు స్థలమునకు సమీపములో నున్నాము. అయినను మీకేదియు భయములేదు. మన మీ మార్గమును విడిచి కాలిమార్గమునఁ బోయి భయపడవలసిన స్థలమును దాఁటినతరువాత పెద్దబాటలో వెళ్ళి చేరుదము.

రాజ__ఏలాగు నయినను మమ్ము సుఖముగాఁ దీసికొని వెళ్ళ వలసిన భారము నీది. నీ వేత్రోవను రమ్మన్న నాత్రోవనే వచ్చెదము.

అప్పు డాకిరాతుఁడు వారిని పెద్ద త్రోవ నుండి మరలించి యిఱుకుదారిని వెంటఁ బెట్టుకొని పోవుచుండెను. ఇంతలో మబ్బు పట్టి దారి కానరాక గాడాంధకార బంధురముగా నుండెను. చెట్లమీఁది పక్షుల కలకలము లుడిగెనుగాని గ్రుడ్లగూబ మొదలగు కొన్ని పక్షులు మాత్రము మేతకయి సంచరించుచుండెను; చిమ్మటలు కీచు మని దశదిశలయందును ధ్వనిఁ జేయఁజొచ్చెను; అడవిమృగముల యొక్కకూతలును పాముల యొక్క భూత్కారములను కర్ణకఠోరములుగా వినఁబడుచుండెను. నడుమనడుమ మేఘములలోనుండి తళుక్కని మెఱు పొక్కటి మెఱసి కొంచెము త్రోవ కనఁబడుచుండెను. ఈరీతిని కొంచెము దూరము నడచినతరువాత దూరమున వెలుతు రగ పడెను; ఆ వెలుతురు సమీపించిన కొలఁదిని గొప్పమంటగా నేర్ప డుచు, ఒక్క గొప్ప చింతచెట్టునకు సమీపముగా నుండెను. చీకటిలో