పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 రాజ__స్వామీ! మీ శిష్యులీవఱకును రాలేదు. రెండు గడియల ప్రొద్దున్నది. వేగిరము వర్తమానము పంపెదరా?

యోగి__ఆవశ్యముగాఁ బంపెదము,

అని చివాలున లేచి జువ్విచెట్ట్టునకు నూఱుబారల దూరములో నున్న యొక గుడిసెయొద్దకుఁ బోయి 'గోపాలిగా యని యొకపిలుపు పిలిచెను. లోపలినుండి చినిగినగుడ్డను కట్టుకొని బొగ్గువంటి శరీర ముతో బుఱ్ఱముక్కును మిట్టనొసలను తుప్పతలయు గొగ్గిపళ్ళును గల యొక కిరాతుఁడు బయలవచ్చెను. వానితో నేమేమో మాటాడుచు పందిరివఱకును దీసికొనివచ్చి, రాజశేఖరుఁడుగారు వినుచుండగా 'వీరికి సహాయముగాఁ బంపుటకయి మనవాండ్రను బిలుచుకొని యిక్కడ నున్నట్టగా రమ్మ'ని పంపెను.

రాజ__స్వామీ! మీ శిష్యు లేవేళకు వత్తురో చీకటిపడక ముందే వేడిమంగలము దాటవలేను. మేము నడుచుచుందుమా?

యోగి__అవును. మీరు చెప్పినమాట నిజమే. మీరు నడుచు చుండుడు, వాండ్రు వచ్చి మి మ్మిప్పుడే కలసికొందురు.

అప్పుడు రాజశేఖరుడుగారు పెండ్లముతోను బిడ్డలతోను బయలుదేఱి దొంగల పేరు జ్ఞప్తికి వచ్చినప్పడెల్ల గుండెలు తటతటఁ గొట్టుకొన, బుజముమీఁది మూటను పలుమాఱు తడవి చూచుకొనుచు, చీమ చిటుక్కు-మన్న వెనుక దిరిగి చూచుచు, కొంచెమెక్కడ నయినను పొద కదలిన నులికి పడుచు నడుచుచుండిరి.ఆ యోగిచే బంపబడిన కిరాతుఁడును వేగముగా నడచిపోయి త్రోవలో నొకచోట దిట్ట ముగా కల్లు నీళ్లు త్రాగి తూలుచు తల వణికించుచు చింతనిప్పుల వలె నున్న గ్రుడ్లు త్రిప్పచు సంకేతస్థలమును జేరి, అక్కడ నొక పాకలో నిదురించుచున్న మనుష్యుని చేతితో గొట్టి లేపి, "ఓరీ ఒక బ్రాహ్మణుండును కొడుకును భార్యయు యిద్దరు కొమార్తెలను నూఱు రూపాయలతో వెళ్లచున్నారు. కాబట్టి మీరు చీమలచింతదగ్గఱకు వేగిరము వెళ్ళవలె నని మన గురువుగారు చెప్పినారు" అని చెప్పి పోయెను. అతఁ డామాటలు విన్న తోడనే కొంతసే సేమో యాలో