పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కును క్రోసెడుదూరము కలదు. పెద్దాపురమును పాలించుచున్న కృష్ణ గజపతిమహారాజుగారు మిక్కిలి ధర్మాత్ములు: వారు తమ ప్రజల క్షేమమును విచారించు నిమిత్తమయి మాఱు వేషము వేసికొని తిరుగు చుందురు; వారియొద్ద మా బంధువొకఁడు గొప్ప పనిలో నున్నాఁడు. మీరు భీమవరములో నుండెడిపక్షమున, మా వానితో మాటాడి సమయము వచ్చినప్పడు మీకొక యుద్యోగమును జెప్పించెదను.

రాజశేఖరుఁడుగారు మంచివారుగనుక పెద్దాపురము వెళ్ళిన మీఁదట నాలోచించెదమని యప్పటికి చెప్పిరిగాని,యా రాజుస్థితిని జూచి యాతఁడుద్యోగము జెప్పించునన్న యాశను మాత్రము పెట్టుకొన్నవారు కారు. ఈ మాటలు ముగియునప్పటికి వారు గ్రామమును సమీ పించిరి.

రాజ__ఆ చెట్లకు గ్రామ మెంతదూరము?

రామ__గ్రామసమీపమునకు వచ్చినాము. ఆ చెట్లు చెఱువు గట్టు మీదివి; చెఱువున కెదురుగానే సత్రమున్నది.

రాజ__మీరీపూట మాతో భోజనము చేసెదరా?

రామ__నాకు గ్రామములో బంధువులున్నారు; అక్కడకు వెళ్ళి భోజనముచేసి, చల్లపాటు వేళ మెల్లఁగా బయలుదేరి వచ్చెదను. మీరు స్త్రీలతో బయలుదేఱినారు. కాబట్టి భోజనముచేసినతోడనే ప్రయాణమయి ప్రొద్దుకుంక ముందే వేడిమంగలమును దాటవలెను. అక్కడ దొంగల భయము బహు విస్తారము. మీరేలాగున నయిన శ్రమచేసి చీకటిపడకముందే పెద్దాపురము చేరి యొకనాఁ డక్కడ నుండుఁడు. నేను మిక్కిలి డస్సియున్నాను గనుక మీతో నిప్పుడు రాలేను. రేపటిదినము వచ్చి మిమ్ముఁ గలిసికొనెదను.

అని రాజశేఖరుడుగారికి నమస్కారము చేసి, అందరివద్దను సెలవు పుచ్చుకొని తోవలో భద్రమని పలుమాఱు చెప్పి, రామరాజు తనదారిని పోయెను. వంటలైన తరువాత భోజనములుచేసి వారందఱును బయలుదేఱి యెండలో దేహముల నిండను జెమ్మటపట్ల, ఆడు గడుగునకు ముంతెడు నీళ్ళు త్రాగుచు నడుమనడుమ వృక్షచ్ఛాయలను