పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

 రాజ__కాశియాత్రకయి బయలుదేఱినారము.

రామ__ఈ వేసవికాలము ప్రయాణమున కెంతమాత్రమును మంచిసమయముకాదు. ఈ యెండలో మీరు గాడుపుకొట్టి పడిపోవుదురు. త్రోవపొడుగునను దొంగల భయము విశేషము. మీకు రాజమహేంద్రవరములో నెవరైన బంధువులున్నారా? లేక మీకదే నివాస స్థలమా?

రాజ__గోటేటి రామమూర్తిగారిని మీ రెఱుఁగుదురా? అతఁడు నా పినతండ్రి కొమారుఁడు; వారి యింటనే నేను పదియేను దినము లుండి బయలుదేఱినాను. మా స్వస్థలము ధవళేశ్వరము.

రామ__మీపేరేమి? వీరందఱును మీకేమగుదురు?

రాజ__నా పేరు రాజశేఖరుడు; వాఁడు నా కొమారుడు; ఆ యాడుపిల్లలిద్దఱును నా కొమార్తెలు; అది నా భార్య.

రామ__మీరింత వేసవికాలములో యాత్రకు బయలుదేఱుటకు కారణమేమి? మీ వైఖరి చూడ మిక్కిలి సుఖము ననుభవించినవారుగాఁ గనఁబడుచున్నారు.

రాజ__నేను మొదట ధనికుఁడనే యౌదును, కాని నావద్ద నున్న ధనమునంతను నా కొమార్తె వివాహములో నిచ్చిన సంభావనల క్రిందను ముఖస్తుతులనుచేయు మోసగాండ్రకుఁ జేసిన దానముల క్రిందను వెచ్చపెట్టి బీదవాఁడనయిఁ కడపట యాత్రకుఁ బయలుదేఱి నాను.నిత్యమును వారి స్తుతిపాఠముల స్వీకరించి నేను తుష్టిపొందుచుం టిని; నా ధనమును స్వీకరించి వారు తృప్తినొందుచుండిరి. తుదకొక బైరాగి బంగారము చేసెదనని నాయొద్దనున్న వెండి,బంగారముల నపహరించి వానికి బదులుగా నింత బూడిద నిచ్చిపోయి నన్ను నిజమైన జోగినిగాఁ జేసెను.

రామ__మున్నెప్పుడును మీరు దూరదేశప్రయాణములను చేసినవారుకారు.నా మాటవిని మీ రీ వేసవికాలము వెళ్ళు వఱకైన భీమవరములో నుండుఁడు. అది గొప్ప పుణ్యక్షేత్రము; భీమ నది సమీపమున భీమేశ్వరస్వామివారి యాలయమున్నది; దానికిని పెద్దాపురమున