చూచి రెండవ ప్రక్కకొత్తిగిలి మఱికొంతసేపునకు సేద తేఱి, ఆ రాజు తన జీవములను నిలిపినందులకై రాజశేఖరుఁడుగారికి కృతజ్ఞతతో బహనమస్కారములు చేసి లేచి కూరుచుండెను. ఇంతలో పల్లెకుఁ బోయినవారు మజ్జిగయు, కొన్ని పండ్లను దీసికొనివచ్చి యిచ్చిరి. ఆ రాజు కొన్ని పండ్లను లోపలికిఁ బుచ్చుకొని మజ్జిగ త్రాగి స్వస్థ పడెను. అంతట నక్కడనున్న వారందఱును తమ తమ త్రోవలను బోయిరి. ఈలోపల మాణిక్యాంబ మొదలగువా రొక తరువు నీడను గూర్చుండి మార్గాయాసము కొంత తీర్చుకొనిరి. రాజశేఖరుఁడుగారు మిక్కిలి బడలియున్నవారయ్యను, సమీపములో నెక్కడను ఊరు లేదని విన్నందున నేవేళకైనను రాజా నగరమునకుఁ బోవ నిశ్చ యించుకొని, తమవారినందఱిని లేవ నియమించి యారాజుతో ముచ్చట లాడుచు దారిసాగి నడవనారంభించిరి.
రాజ:__రాజుగారూ! మీ పేరేమి? మీ నివాసస్థల మెక్కడ? మీరిక్కడ కొంటిగా నెందుకు వచ్చినారు?
రాజు__నాపేరు రామరాజు; మాది పెద్దాపురమునకు సమీప ముననున్న కట్టమూరు వాసస్థలము; మా కక్కడ నాలుగు కాండ్ల వ్యవసాయ మున్నది:రాజమహేంద్రవరములోనున్న మా బంధువులఁ జూచుటకై పది దినముల క్రిందటపోయి, నిన్న తెల్లవారుజామున బయలుదేరి మరల వచ్చుచుండఁగా నొక పెద్దపులి వచ్చి న న్నెదిరించి నది; నాపైన నున్న యుత్తరీయమును వేగముగా నెడమచేతికిఁ జుట్టుకొని యాచేయి పులినోటి కందిచ్చి రెండవచేతిలోని కత్తితో దాని ఱొమ్మునఁ బొడిచితిని; ఆ పులి బలముకలది కాఁబట్టి యాపోటును లక్ష్యముచేయక త్రోవపొడుగునను నెత్తురు గాలువలగట్ల నన్నడవి లోనికి బహుదూర మీడ్చుకొనిపోయెను; ఈలోపల నేనును కత్తితో దానిని పలుచోట్లను బొడిచినందున నడువలేక యొక వృక్షసమీపమునఁ బడిపోయెను. నేను బహప్రయాసముతోఁ జేయి వదల్చుకొనుటకై కుడిచేతిలోని కత్తి వదలిపెట్టి దానినోరు పెగలించి చేయూడఁదీసి కొంటిని; ఇంతలో మునుపటిదానికంటెను బలమైన మఱియొక