పుట:Raajasthaana-Kathaavali.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృథివిరాజు సాహసములు.

69


వనుకొని యచ్చట నుండిరి. అట్లుండ నొకనాఁడు రేయి నిశ్శబ్దమైన యడవిలో కత్తుల రాపిడి చప్పుడు వినంబడియె. అది విని సురేశమల్లుఁడు మా యన్న కొడుకు వచ్చినట్లుతోఁచుచున్న దని యింక నేమో చెప్పఁ బోవుచుండఁగ నే పృథివిరాజు సపరివారముగ వానిముందరకు దుమికి ఖడ్గముతోఁ బినతండ్రి నొక్క యేటు యేయుటయు సారంగ దేవుఁడు వాని కడ్డమువచ్చి "సురేశమల్లుఁడు గాయములచేఁ బీడితుఁడై కదల లేక యున్నవాఁడు, తొల్లి యిరువది దెబ్బలకైనను సరకు సేయని యీ శూరుఁ డిప్పు డొక గుద్దున కైన నోప లేఁడు గావున నవధ్యుం" డని పలికె. అప్పుడు సురేశమల్లుఁడు నేను పోయెనని నాయన్న కొడుకు చేతిలోనేగదా' యని పృథివి రాజు వంక దిరిగి కుమారా! కయ్యము మానుము. నీవు నన్ను జంపినది యొక లెక్కలోనిది గాదు. నాకుఁ గుమారులు కలరు వారు రాజపుత్రు లగుటచే వారికి సాయసంపత్తులు గలుగును; కాని మేము నిన్నే చంపుట సంభవించిన యెడల చిత్తూరుగతి యేమగునో? నిన్నుఁజంపి నేనెల్ల కాలము లోకనింద పాలు గావలసివచ్చు నని వీరపురుపోచితముగఁ బలికెను. దయనీయములగు పినతండ్రిపలుకులు విని పృథివిరాజు హృదయము గరుగఁ గత్తు లొరలో నుంచుఁడని తన సైనికుల కానతి చ్చెను. పిమ్మట పినతండ్రి యుం గొడుకును నొండొరుల బిగ్గగౌఁగిలించుకొనిరి. తోడనే' నిరుబలములు తమతమ ప్రాంత పగలు కోండొకతడవు మరచి మరల కలసి మెలసి కూరుచుండి యిష్టగోష్ఠిం బ్రవర్తిల్లిరి.

అనంతరము వృథివిరాజు పినతండ్రిని జూచి "అయ్యా! నేను వచ్చునప్పటికి మీ రేమి చేయుచుండి" రని యడిగెను. చేయుట కేమి యున్నది. ఉన్న మట్టుకు దిని యుబుసుపోక పిచ్చపాడి చెప్పుకొనుచుంటిమని సురేశ మల్లుఁ డుత్తర మిచ్చెను. "కాని నీజాడ లరయుటకయి నేను విశ్వప్రయత్నము చేయుచుండుట నీ వెఱిఁగియు నింత యజాగ్రత్తతో నేలయుంటి" వని మరల గుమారుఁ డడుగఁ బినతండ్రి