పుట:Raajasthaana-Kathaavali.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృథివీరాజు సాహసములు.


మివారు దేశపు రాణాయగు రాయమల్లునకు సంగుఁడు పృథివిరాజు జయమల్లుఁడు నను మువ్వురు కొడుకు లుండిరి. అందు పృథివిరాజు నిరుపమాన సాహసుఁడు మహా తేజశ్శాలి. అతఁడు పదునాలుగేండ్లు వయసు గలిగినది మొదలు ప్రతికక్షు లెందఱు వచ్చినను లెక్క సేయక యాయుథ సహాయుఁడై యనేక వీరకర్మముల నొనర్చుచుండెను. మీవారు నందెగాక చుట్టుప్రక్కల దేశము లందుఁగూడ పృథివిరాజు ధైర్యసాహసములకు పెట్టినది పేరు. అందుచేత - నతని యకాలమరణమునకుఁ దరువాత కొన్ని వందల యేండ్ల వఱకు జను లాతని వీరవిహారముల నెంతో చిత్రముగఁ జెప్పుకొనుచు వచ్చిరి.

పృథివిరాజు తన బలము తా నెఱిఁగినవాఁ డగుటచే దనకు తరతరములనుండి శత్రువులయిన మహమ్మదీయులతోఁ జిత్తూరులోని శూరులం గూర్చుకొని యుద్ధము సేయుట పండువుగాఁ దలంచుకోనెను. తనయన్న సంగుఁడు తనకన్న శాంతుఁడును వివేకియు నైనను అతఁడు సింహాసన మెక్కడనియుఁ దానె సింహాసన మెక్కి చిత్తూరు నేలునట్లు బ్రహ్మ వ్రాసినాఁ డనియు నతండు పలుమాఱు చెప్పుచుండును. ఒకనాఁడు పృథివిరాజు పినతండ్రియగు సురేశమల్లుఁడును సోదరులు నుండగ పైన జెప్పినట్లు పలికెను. ఆమాటలు విని సంగుఁడు తమ్మునితో నిట్లనియె.

“తమ్ముఁడా! దేవతలయభీష్టమే చెల్లనిమ్ము. విధినిర్మాణ మట్లున్న యెడల నేను జ్యేష్ఠుఁడ నయినను రాజ్యమును నీనిమిత్తమయి విడిచి పెట్టెదను. అయినను మనయూరు బైట వ్యాఘ్రగిరిమీఁదనున్న చారుణీదేవియొక్క యర్చకురాలియొద్దకుఁ బోయి తండ్రియనంతరమున మాలో నెవ్వఁడు రాజగునని మన మడుగుదము.” అందుకు