పుట:Raajasthaana-Kathaavali.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణాహమీరు,

25


ఆ బాలిక వాని టక్కరితనమును ముందే గ్రహించి. జాగ్రతపడి యించుకయు జడియక చల్లగ నొక మేకపిల్లను గుఱ్ఱపుకాళ్ళ కడ్డముగ వదలెను. గుఱ్ఱము బెదరి తత్తర పడి యాశూరశిఖామణిని నేలఁ బడవైచెను. ఆపడుచు చెక్కు చెదరక పాలొకచుక్క యైనఁ దొనగకుండ చేతిలోని తాళ్లు వదలకుండ నేమియు నెఱుఁగనట్లు తన దారిం బోయెను. రాజకుమారుఁ 'డీవినోదమును గనిపెట్టి చూచి బాలికను పిలిచి నీ వెవ్వరిదాన వని యడిగెను. “నేను చందన వంశజుఁ డగు నొక రాజపుత్రుని కుమా తే౯ను. మాయిల్లిక్కడకు సమీపమే” యని బదులు చెప్ప. రేపు మీతండ్రిని నాయొద్ద కోకసారి రమ్మని చెప్పు' మని పలికి యతఁడు త్వరితముగా నింటికిఁ బోయెను.

మఱునాఁ డుదయమున నా బాలిక తండ్రి రాజపుత్రుని యొద్దకు వచ్చి తాను నిరుపేద యయ్యు నందఱు నాశ్చర్యపడునట్లు వానితో సమానముగఁ గూర్చుండి సమానునితో మాటలాడునట్లు సంభాషించెను. అప్పుడు హరసింగు నీకూఁతును నా కిచ్చి పెండ్లి చేయు మని యడుగ నావృద్ధుఁడు తనకూఁతుని రాజులకిచ్చు యుద్దేశము లేదని ఖండితముగఁ జెప్పెను. హరసింగు సజ్జనుఁ డగుటచే వానిఁ జెరబెట్టించి యామెను బలవంతముగా గ్రహించుటకుఁ జెల్లుబడి యుండియు నట్టిపని చేయుట కిష్టపడఁ డయ్యె. కానీ యాముసలివాఁడు గృహంబునకుఁ బోయి తన్నామె మెచ్చుకొను నని తలఁచి జరిగిన వృత్తాంత మంతయు భార్యకుఁ దెలుప నామె కోపించి యెంత తెలివిమాలిన పనిఁ చేసితిరి? సిరిరా మోకాలొడ్డుదురా? ఇప్పుడైనను రాజపుత్రుని యొద్దకుఁ బోయి చేసిన తప్పుల క్షమింపు మని ప్రార్థించి కూఁతును వాని కాళ్ళపైఁ బడ వేయు మని మందలింప మఱునాఁడతఁడు మరల చిత్తూరునకుఁ బోయి రాజనందనుని గాంచి తప్పు క్షమింపు మని ప్రార్థించి కూఁతును వానికిచ్చి వివాహము చేసెను.