పుట:Raajasthaana-Kathaavali.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మిని.

17


కళేబరంబుల మెత్తని పాన్పుగఁ గావించుకొని యొక కఱకుతురక మేను తలగడ నమర్చుకొని వీరశయనమున నుండి చచ్చియుఁ బగతురకు వెఱపుఁ గొలుపుచున్న వాఁడు సుమీ" యని విన్నవించెను. ఆ మాటలు విని యావీర పత్ని నేనిఁకఁ దడయరాదు. ఆలస్యమైన నాజీవితేశ్వరుఁ డాగ్రహింపఁ గలఁ డని నిర్భయముగ నిర్విచారముగ నిశ్శంకముగఁ జిచ్చురికి మృతి నొందెను. అప్పుడు మీవారు రాజ్య మంతయు దుఃఖ సముద్రనిమగ్న మయ్యెను. రాజపుత్ర వీరులలో ననేకులు మృతి నొందినను జక్రవర్తి చిత్తూరుకోటం బట్టుకొనువిషయమున నాస వడలుకొని చిన్న బుచ్చుకొని ఢిల్లీ నగరమునకుం బయనమై పోయెను.

చక్రవర్తి, కంతటితో బుద్ధి వచ్చి యుండునని రాజపుత్రులు తలంచిరిగాని యాపంతగొండి చిత్తూరునందు జరిగిన పరాభవము నిప్పువలె వానిహృదయమును దహిచుటం జేసి పగ దీర్చుకొనుటకుఁ దగిన సమయమును నిరీక్షించు చుండెను. వెనుకటికయ్యమునాటికి బాలుఁడై నలక్ష్మణసింగు యుక్త వయస్కుడై రాజ్య భారము బూని క్రమక్రమంబునఁ బండెండుగురు కొడుకుల తండ్రి యయ్యెను. భీమసింగు పద్మినీ దేవినిం గూడి యెప్పటికిని రాజగౌరవము నందుచు దేహదార్థ్యము గలిగి తమ్మికోలని చెంత 'మేడలో సుఖించు చుండెను. అలాయుద్దీను చక్రవర్తి యు నేపని చేయుచున్న నేవిషయమై ఆలోచించుచున్న నెవరితో మాటలాడుచున్న పద్మినీ ముఖపద్మమును మఱువక యుత్కంఠముతో నుండెను.

ఇట్లుండి యుండి ప్రజలకు దుర్భరముగఁ బన్నులు గట్టి ధనము చేర్చి మహా సైన్యమును గూర్చుకోని మీవారు పై దండెత్తి చిత్తూరుకోటను మరల ముట్టడింపసాగెను. చక్రవర్తి సాహసమును జూచి రాజపుత్రులు తొలుదొల్త నెగతాళి చేసిరి. రాతిగద్ది యపై ఁ గూరుచున్న యంగనలవలె బురలక్ష్మి చక్రవర్తికి దుర్భేద్యమైనట్టు కనఁబడెను. కాని తూర్పు ద్వారమువద్ద నేల కొంచె మెత్తుగ నుండినందునఁ జక్ర