పుట:Raajasthaana-Kathaavali.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

రాజస్థానకధావళీ.


కట్టవలసిన యాచారము గలదు. ఆయాచారము నడపుటకు జగ్మల్లున కొక్క పక్క చందావతువంశస్థుఁడును రెండవ ప్రక్క వాని చేయిపట్టుకొని తారువంశస్థుఁ డగు వేరొక వీరుఁడు నుండిరి. అపుడు చందావతుఁడు గద్దెయెక్కఁబోవుచున్న జగ్మల్లుయొక్క హస్తముఁ బట్టుకోని "దేవా మీరు పొరఁబడుచున్నారు. ఈ పీఠము మీ రెక్క వలసినదిగాదు. ఇది మాసోదరుఁ డగు ప్రతాపుఁ డధిష్టింపవలసినది.” అని నిర్భయముగఁ జెప్పెను. జగ్మల్లు వానిపలుకులు సరకు సేయక యతనిచేయి విదల్చుకొని యాగడము చేయఁ దలంచెను; కాని చందావతుఁడు వానిని సందిట నిఱికించి యొకచోట:గూలవై చి ప్రతాపునిం దోడి తెచ్చి గద్దెయెక్కించి వాని మొలకుఁ గత్తికట్టి సాగిలంబడి ముమ్మాఱు వాని చరణములకు మొక్కి మీవారు రాణా ప్రతాపసింగేయని మేఘగంభీర భాషణములతో నొక్కి చెప్పి చప్పట్లు కొట్టెను.

అంతకుమున్న రాజ్యభ్రష్టుఁడై దేశములపాలై పోవలసిన యవస్థలోనుండి యాకస్మికముగ మండలాధిపతియై సింహాసన మెక్కఁగలిగినందులకు గర్వించి విజృంభింపక ప్రతాపుఁడు నిశ్చలమనస్కుఁడై శాంతముతో నుండెను. పట్టాభిషేక మహోత్సవము ముగిసినతోడనే ప్రతాపుఁడు సామంత ప్రభువులం బిలిచి యది వసంత కాలమనియు నడవిపందిని 'వేఁటాడి గౌరికి సమర్పించి ముందుసంవత్సరము తన యదృష్ట మెట్లుండునో తెలిసికొనవలయుననియుఁ జెప్పి గుఱ్ఱమెక్కి వారిం దోడ్కొని వేటకుఁ బయలు వెడలెను. రాజస్థానమునందంతట గౌరి యిప్పటికి ననేక నామములతోఁ బూజింపఁబడుచున్నది. ఇట్లు వెడలి వా రడవిపందిని జంపి దానిని దేవి కర్పించి యామెను సంతుష్టిపఱచి మఱుచటియేడు తమకు జయకరముగ నుండునని తెలిసికొని సంతసించిరి. అది మొదలు రాణాప్రతాపసింగు పలుమా ఱీవిధముగఁ బలుకుచు వచ్చె. "రాణా సంగునకు నాకును