పుట:Raajasthaana-Kathaavali.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు మూడవముట్టడి,

135


నేర్చిన పలుపండితు లుండి యనేక బహుమానముల నందుచువచ్చిరి. అతనికి స్వమతమునందు గౌరవము దక్కినమతములందు నిరసనము లేదు. ఖురాను నేర్చిన మౌలవీలను క్రైస్తవమతబోధకులను బౌద్ధ పండితులను వేదాంతశాస్త్రజ్ఞులగు బ్రాహ్మాణులను పారసీమతస్థులను దనకోలుపునకు బిలిపించి వారిచే వాదములు చేయించి సర్వమతముల సారములం గ్రహించుచుండు వాఁడు. వానిని హిందువులు వేదాంతి యనియు క్రైస్తవులు క్రైస్తవుఁ డనియు మహమ్మదీయులు మహమ్మదీయుఁడనియు జెప్పుచుందురు. ఉపనిషత్తుల యెడ నక్బరునకుఁ గడు ప్రేమయని చరిత్రకారులు చెప్పుదురు. ఆయన వితంతు వివాహములు హిందువులలోఁ జేయింపవలయునని కొంత ప్రయత్నము చేసెను. ఘోరదురాచారమగు సహగమనమును దన దేశమునఁ జాల వఱకు మానుపించెను.

ప్రజలకు భాగముగానున్న పన్ను లనేకములు దొలగించెను.'రాజాటోటర్ మాల్' అను హిందువునకుఁ గొప్ప యుద్యోగమిచ్చి దేశమునందున్న యీనాం జిరాయితీ భూములను వాని చేత జాగ్రత్తగా కోలిపించి పంటనుబట్టి యాభూములకు పన్నులుగట్టించెను. పండిన పంటలో నాలుగవ వంతు చక్రవతి౯ పన్ను క్రింద గ్రహించుచుండును. అక్బరు చక్రవతి౯ విద్యావంతుఁడు మహావీరుఁడు లోక వ్యవహారములు చక్కగఁ దెలిసినవాఁడు. ఈతనివంటి చక్రవతి౯ నేటివఱకు హిందూదేశమునకు మరల రాలేదని జనులు చెప్పుకొందురు. ఆయన రమారమి యేఁబది సంవత్సరములు భరతఖండమును బాలించి సకల జనస్థవనీయుఁ డై క్రీస్తుశకము 1605 సంవత్సరమున లోకాంతరగతుఁ డయ్యెను.