పుట:Raajasthaana-Kathaavali.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు మూడవముట్టడి.

131


బెట్టుకొనెను. కాని యావీరమాతకడుపునఁ బుట్టిన బాలకుఁడు కులమున కప్రతిష్ఠ రానీయలేదు. చిత్తూరుకోటలో దల నెరసిన వృద్ధులు, మీసములు రాని బాలురు, మహా యుద్ధములలో గాయములు దిని బ్రతికిన శూరులు, నంతఃపురము విడిచి యెఱుఁగని పుష్పకోమల లగు స్త్రీలు, సేవకులు మెదలగు నందఱు గెలువవలయు చావవలయు నను మాటమీఁద నిలువఁబడి యుండిరి. ఈ యుద్ధములోనే నూతనముగ భర్తను గోల్పోయిన యాబాలుని తల్లియు, వానిం గోరి వరించిన కొత్త పెండ్లి కూఁతురును కవచములఁ దొడుగుకొని, బల్లెములు బూని యుద్ధసన్నద్ధు లై మీవాఱు రాజపుత్రులతో గలిసి పోరుసలిపి వీర స్వర్గమును జూరగొనిరి. ఆఁడువాండ్రే యంత సాహస మొనర్చినపుడు మగ వాండ్రు వెనుకదీయక సమరోన్ముఖులైరి. చిత్తూరుముట్టడికథ యన్నిటి కంటే నెక్కువ దుఃఖకర మయినదియు నతిసాహసవంత మయినదియు నని చెప్పవచ్చును. అక్బరు తాను వసియించు కొండచివఱనుండి చూచుచు నడుమనడుమ మంట వెలుతురులోఁ గోటమీఁద నెవరైన మనుష్యులు నిలిచినట్లు గనఁబడినపుడు తనతుపాకితో వారిం గొట్టు చుండును. ఆదినమున 'సాయంకాలము నమాజు వేళ నక్బరు చక్రవర్తి మున్ను వేఁట కరణ్యమునకుఁ బోవునప్పుడు పట్టపు టేనుఁగు నెక్కి పెద్ద పులిరాఁకకై యెదురు చూచినట్లే పర్వత శిఖరమునుండి మెలకువతో నెవరినిమిత్తమో కని పెట్టి యుండెను.

అప్పుడు దుర్గ సంరక్షణము చేయుచున్న జయమల్లుఁడను రాజపుత్ర వీరుఁడు తనబంట్లకు గొంతయుపదేశము చేయవలసి బురుజుమీఁ దికి వచ్చెను. కొండమీదనుండి జాగరూకతతోఁ జూచుచున్న యక్బరు నకు వానియాకృతి చూచాయగఁ గనఁబడియె. కనఁబడినతోడనే చక్రవతి౯ సంగ్రమను తనతుపాకిని బట్టుకోని గురిజూచి కొట్టెను. వెంటనే జయ మల్లుఁడు ప్రాణములు విడిచి నేలఁబడియెను.