పుట:Raajasthaana-Kathaavali.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

రాజస్థానకథావళి.


విడిచిపోవుటకుఁ దన యుంపుకత్తెయే కారణ మనియు నామె తనకుఁ జేసినమహోపకారమువలననే తన రాజ్యము తనకు దక్కిన దనీయు నుదయసింగు చెప్పి సంతోషించెను.రాణాకు దనయుంపుడుకత్తెమీఁద నున్నంతమాత్రపు గౌరవమైనఁ దనమీఁద లేదనియుఁ దాము కష్టపడి ప్రాణముల కాశపడక పోరాడుట యెల్ల నిరర్థకము జేసి మెప్పునంతయుఁ తుద కతఁడు తన వలపుకత్తియకే యిచ్చె ననియు రాజబంధువులు కోపోద్దీపితులై యా వలఫులాడినిఁ జంపించిరి. అప్రయోజకుఁ డగు రాణా దనరాజ్యమును నిలిపిన యాపడఁతి ప్రాణరక్షణముఁ జేయం బ్రయత్నింపలేదు సరిగదా, దానిం జంపిన వారిని శిక్షింపనైన లేదు. ఈ పర్యాయ మక్బరు రాణా యొక్క భోగభార్యవలనఁ బరాజితుఁ డయ్యె నని మహమ్మదీయ చరిత్ర కారు లెవ్వరు వ్రాయరైరి. చరిత్రకారులు వ్రాసిన దేమనఁగా 1567 వ సంవత్సరమున నక్బరుచక్రవతి౯ రాజస్థానమును దండెత్తి చిత్తూరుకోటను బట్టుకొనుటకు నాలుగు వేల సేనతో వచ్చెనని ఈ సంవత్సరమునఁ జక్రవతి౯ కోటను ముట్టడించి పట్టుకొనుటచే నది మాత్రమే వారు వ్రాసి వెనుకటి పరాజయమును వారు వ్రాయరైరి. అక్బరు మంచి ఫిరంగులతోడను సాధన సామగ్రుల తోడను వచ్చియున్నను జిత్తూరుకోటలో భోజన సామగ్రులు జలము సమృద్ధిగా నుండుటచే దుర్గసంరక్షకులు మొగలాయిసేనం జూచి వీరా! మనల జయించువారని పరిహసించిరి. అక్బకు సైనికులును మొట్ట మొదట కోట దుస్సాధ్యమని యాస వదలుకొనిరి. కోటగోడఁ దూర్పున నుత్తరమున నల్ల రాతితోఁ గట్టఁబడుటచే నా వైపులగోడలకు ఫిరంగులవలన 'నేమియు భయము లేదని వార లనుకొనిరి. అట్టికోట ప్రపంచమం దెచ్చట లేదని విదేశీయు లనేకులు వ్రాసిరి. బురుజులు మిక్కిలి దృఢముగా నుండెను, తుపాకిమందు కొట్లకోలఁది యుండెను. అక్బరు కోటకు దూరముగా నొక కొండమీఁద బస చేసి తన సైన్యమునకు రాత్రులు వెలుతురు కలుగునట్లు తనయున్న పర్వతము యొక్క