పుట:Raajasthaana-Kathaavali.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు మూడవముట్టడి.

125


ములలో మృతినొందెను. వానివంశస్థులు నీతిదూరులు బలహీనులు నగుటచే రాజ్యము వారికిఁ దక్కదయ్యె. ఆయప్రయోజకులు దేశము నంతయుఁ బాడు చేసి యరాజకమగునట్లు గావించి ప్రజల కవాతులగుటంజేసి యాయద నెఱింగి హుమాయూను ముందుగా పాంచా లము జయించి తరువాత శత్రువుల నోడించి ఢిల్లీని పట్టు కొని మరల చక్రవర్తి యయ్యెను. అతఁడు మఱల సింహాసన మెక్కిన పిదపఁ జిరకాలము రాజ్య మేల లేదు. గద్దెయెక్కిన యారు నెలలకే యతఁడు తన మేఁడమీఁది స్ఫటికపురాళ్ళ మీదనుండి జారి మెట్ల మీదఁనుండి దొర్లి క్రింద పడి తత్కారణమున కొన్ని దినములలో మృతుఁడయ్యెను.

అతని యనంతరమున రాజ్యమును వహించిన యతఁడు తొల్లి యమరకోట, నుదయించిన బాలుఁడే తండ్రి పోవునప్పటి కతఁడు పదుమూడేండ్ల ప్రాయము వాఁడు. అక్బరు పాంచాలమును ఢిల్లీని మఱియుదండ్రి పాలనము క్రిందనున్న కాబూలు గాంధారములను జేకొనియెను చిత్తూరును బాలించుట కుదయసిం గెంత చిన్న వయస్సులో నారంభించెనో యక్బరు ఢిల్లీ నేలుట కంత చిన్న తనమున నారంభించెయి. కాని వీరిరువురు వేరు వేరు స్వభావములవారు.

ఉదయసింగు రమారమి ముప్పదినువత్సరములు రాజ్య పాలనము చేసి యున్నను వాని యేలుబడిలో మంచిపని యని చెప్పఁదగిన దొకటియు జరుగ లేదు. శూరశిఖామణులలో నగ్రగణ్యుఁ డని చెప్పఁదగిన రాజుకడుపున బుట్టియు నుదయసింగు సింగముకడుపున బుట్టిన మేఁక పిల్ల వలె సమయము వచ్చినప్పుడు పిరికియై మూర్ఖుఁడై నగుబాట్ల నొందుచువచ్చెను. వేయిమాట లేల? బప్పరావులవంశస్థుల యొద్దఁ గానఁబడవలసిన శుభ చిహ్నములు రాజలక్షణములు వాని యొద్ద కానబడక పోవుటచే వెనుక పున్న యను దాని చేఁ బెంపఁబడిన మీవారు రాజపుత్రుఁ డతఁడు గాడనియు నెవరో యొక దొంగపిల్లవానిం దెచ్చి యతఁడే రాజ పుత్రుఁడని భ్రమ పెట్టి రనియుఁ గొందఱు దలంచిరి.