పుట:Raajasthaana-Kathaavali.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజస్థాన కథావళి.

(మొదటి భాగము.)


బప్పరావుల కథ.

——:(O):——

అనేక సంవత్సరములక్రిందట హిందూదేశమున వల్లభిపుర మను పట్టణమును శిలాదిత్యుం డనుమహారా జొకఁడు పాలించుచుండెను. అతఁడు చిరకాలము శత్రుదున్నిరీక్ష్యముగఁ బ్రజారంజకముగ నేలనేలెను. శిలాదిత్యుఁడు సూర్యుని కుమారుఁడనియు, నాకారణంబున నతఁడా మహారాజును సంరక్షించుననియు బ్రసిద్ధికలదు. అతని సేనలతో పోరినను వారు తప్పక పరాజయము నొందెడువారు. వల్లభినగరపుఁ గోటలో నొకదివ్యసరస్సు కలదఁట. శిలాదిత్య మహారాజు శత్రువులకు జంకినప్పు డాదివ్యసరస్సునకుఁ బోయి, యొడ్డున నిల్చి చిన్ననాడు తన తండ్రి కరపినమంత్రము నుచ్చరించు నఁట. వెంటనే యాసరోవరమధ్యమునుండి సూర్యునిరథములాగు రంగులగుఱ్ఱ మొకటి బయలు దేఱ నారాజు దాని నారోహించి, రణరంగమునకు జన శత్రుసేనలు వాని యెదుట నిలువలేక పటాపంచలై పారుచుండును. ఇట్లుండ కొంతకాలమున కుత్తరదిక్కునుండ యరులమూఁకలువచ్చి వల్లభిపురమును ముట్టడించెను. ఎన్నినాళ్లు మగంటిమిఁజూపీ పోరొనర్చినను, వారు శిలాదిత్యునిఁ గెలువఁజాలక నిరాశులైరి. అంతలో చిరకాలమునుండి రాజుపై మనస్సులో క్రోధమునిల్పియున్న యాతని మంత్రి యొకడర్థ రాత్రమున, శత్రుశిబిరముంబ్రవేశించి వారితో "నాకోరిన బహుమానమునిత్తు రేని శిలాదిత్యునిఁ గెల్చి వల్లభిపురమును బట్టుకొనునుపాయంబు మీ కుపదేశించెద" నని పలికె. ఆపలుకులు విని వారు సంతసించి వానికోరిక