పుట:Raajasthaana-Kathaavali.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

రాజస్థానకధావళి,


చిత్తూరు రాజ్య మట్టిదుస్థితిలో నుండుటచే శత్రువులు తమతమ ప్రాంతపగలు దీర్చుకొనుట కదియే సందని విజృంభించిరి. గుజరాతు దేశ ప్రభువగు మహమ్మదుషా యనుతుఱక కొంత కాలము క్రిందట బేబరు చేత జయింపఁబడి ఢిల్లీ రాజ్యముతోఁ గల్పఁబడిన మాళవ దేశము నాక్రమించుకొనెను. అప్పటికి జేబరు చనిపోవుటయుఁ బరమసాధువగు హుమాయూను సోదరులచేతను బంధువుల చేతను పలుచిక్కులంబడి మనస్థిమితము లేక యుండుటయు బహుదూరుషాకు మాళ్వాను బుచ్చుకొనుటకు మంచివీలు కలిగించెను.

ఇట్లు బహాదూరుషా ప్రక్కలో బల్లె మై మునుపు మాళవదేశపు ప్రభువు లగుతురకల నిద్దఱిని చిత్తూరు రాజులు ఖయిదీలుగా దీసికొనిపోయి వానిలో నొకనికిరీట మపహరించి యవమానించిన ప్రాంతవృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుకొని సాటితురకలకు జరిగిన దారుణ పరాభవమునకుఁ దగిన ప్రతీకారముఁ జేయుటకు సమయమును వెదకుచు నెట్టకేలకు విక్రమజిత్తోకసారి బూందీనగరమునకుఁ బోయి యున్నప్పుడు పెద్దసేనం గూర్చుకొని చిత్తూరుపై దండు విడిసెను.

విక్రమజిత్తు సహజముగ తొందరగలవాఁ డగుటచేఁ దన ప్రతి కక్షులు తన సేనకన్న నథికసంఖ్య గలవారై యున్నను సరకుగొనక మహమ్మదీయ సైన్యములం దాఁక నిశ్చయించుకొనెను. విక్రమజిత్తు తత్సమయమున నేమి సేయుటకుం దోఁచక మనోవేదన నందవలసి వచ్చె. కూలికి వచ్చిన సిపాయిలు శత్రువుల గొప్ప సేనం జూచి భయపడి పోరుటకు సాహసింప రైరి. రాజపుత్ర సైనికులం బోరు మని రాణా యడుగ తమ్మవమానించి జీతగాండ్రఁ బిలిపించిన రాజుపక్షమున నిలిచి పోర నొల్ల రైరి. అటు పోరకపోవుట యేగాక యారాజపుత్రులు యుద్ధభూమిని విడిచి పోయి రాణాసంగునకు నొక బూందీ రాజపుత్రిక వలనఁ బుట్టిన యొక చిన్న కుమారుని రాణాగా జేయఁ దలంచి కోట శత్రువుల బారిఁ బడకుండఁ గాపాడుటకుఁ జిత్తూరు బ్రవేశించిరి.