పుట:Raajasthaana-Kathaavali.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు రెండవముట్టడి

98


గమున కొందఱు గుఱ్ఱములు దిగి ఫిరంగులు కాల్చుటయు మణికొందఱు నేలనేయుండి కాల్బలమై తుపాకులతో యుద్ధము చేయుటయు నని దెలిసికొనవలయును. విక్రమజిత్తు చెప్పిన మాటలు రాజపుత్రులకు మిక్కిలి గౌరవ భంగమని దోఁచుటఁ జేసి వారందఱు బుఱ్ఱపోయినను గుఱ్ఱములు దిగి కత్తివిడిచి యుద్ధము చేయమని వాదించిరి. అట్టి మోట యుద్ధమువలనఁ గలుగు నష్టమును తుపాకి యుద్ధమువలనఁగలుగు లాభమును జూపి రాజు వారి నెంత వేఁడుకొన్నను వినక వారు “గుఱ్ఱములమీఁద నుండియే శత్రువుల ఫిరంగులం బాలుపడి ప్రాణములనై నను విడుతుము; కాని నేల దిగి తుపాకి చేతఁబట్టుకొని పరువు ప్రతిష్టలు బంపుకొనము సుమీ" యని ప్రత్యుత్తర మిచ్చిరి. అట్టి వారితో వాదించుట నిరుపయోగ మని గ్రహించి రాణా వారియెడల నాస వదలుకోని జీతములనిచ్చి కొందఱు సిపాయిల నేర్పఱచి వారికి నూతన పద్ధతి ప్రకారము యుద్ధము చేయుట నేర్పించెను.

ఈ పనివలన రాజపుత్రులకు మనసులలో రాణా పై క్రోధము నిలిచెను. దానికిఁ దోడు విక్రమజిత్తు కొత్త సిపాయిలకు బహుమానములిచ్చి వారిని గౌరవించి వారితో గలిసి మెలిసి యుండుటచే రాజపుత్రులు తమ క్రోధమును లోలోపల నణచుకొనఁజాలక పైకి వెడలి రాణాతోఁ గలహమునకు డీకొనిరి. రాజ్యమున ప్రతిస్థలమందు ప్రజలు రాణాయొక్క, యధి కారముఁ దిరస్కరించి రాజశాసనముల నతిక్రమించి యుద్యోగస్థులను బరిహసించి యథేచ్ఛముగఁ దిరుగఁ జొచ్చిరి కొండలలోనుండు మన్నె గాండ్రు గుంపులు గుంపులుగఁ జిత్తూరు నగరమువఱకు వచ్చి రాణాకన్నులయెదుటనుండియే పక్క పల్లియల దోచుకొని పశులమందలను దోలుకొనిపోవఁజొచ్చిరి విక్రమజిత్తు కొండదొంగలను దరిమి కొట్టిరండని తన గుఱ్ఱపుదళముల కాజ్ఞాపింప రౌతులందఱు నవ్వుచు జీతబత్తెము లిచ్చి నిల్పిన కొత్తకాల్బలమును బంపుఁడు. మేమేమి చేయగల" మని పలికిరి,