పుట:Raadhika Santhvanamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృతిపతి (శ్రీరంగపతి) ప్రశంసాపద్యములు మూఁడు, నాగ్రంథమధ్యముననే నాయికా నాయకుల సమాగమసందర్భమున నున్న పద్యములు మఱి మూఁడు నొకగద్యయును. (చూ, రా. సాం. సంఖ్య వరుసగా 114 నుండి 120వ పద్యము వఱకు)

ఏమైననేమి, ముద్దుపళని కృతి ముద్రితమై ప్రసిద్ధి కెక్కినది. సముఖము కృతి ముందు పుట్టినను మూలఁబడినది. కాని యతని కవితానవనీతాస్వాదనఫలము మనకు ముద్రితగ్రంథమునుండి ముట్టనే ముట్టినది. అయినను నీకృతిని బ్రచురించవలసిన యావశ్యకతయుఁ గలదు. నిలుకడమీఁదనైనను నిజము తేలవలెను గదా! సముఖమువాని కృతిలో సరసముగాఁ గనిపించిన ప్రతిపద్యమును సంగ్రహించినది ముద్దుపళని. అతని గ్రంథమున నున్నవే నూటయిఱువది గద్యపద్యములు. గద్యములు పోను నూటరెండు మాత్రమే పద్యములు. అందులో నఱువది మక్కికి మక్కిగా గ్రహించినది. (ఆపద్యములన్నియు గ్రంథమున కనుబంధమైన అకారాదిపద్యసూచికలోఁ జుక్కగుర్తులతోఁ జూపించి యుంటిని) ముఖ్యముగా ముద్దుపళని కృతి మూఁడవయాశ్వాసమున నీ యుద్యమ మెక్కువ. అదియే కథయొక్క కండపట్టు—చిలుక రాయబారము, నాయికా నాయకుల విరహము, తత్సమాగమము—అంతేకాక పద్యపాద, పదబంధముల తార్పుడు, భావముల మాఱుమనువులు నిట్టి యలఁతి యలఁతి మార్పులతో మఱి కొన్నింటికి ఛాయలు గల్పించినది.