పుట:Raadhika Santhvanamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాధికాసాంత్వనము 31

సీ. ఈవైన మానాటి కెటు పోయెనో యని
చెప్పి కరమ్ములు విప్పువారు
గలయఁ గల్పులు సేయఁగా రాదె యీ గుణా
ఢ్యుని నంచు నౌదల లూఁచువారు
నీ యతివినయంబు నీ యిళకె కొని పొ
మ్మంచును బహుధిక్కరించువారు[1]
ప్రాలుమా లిటువలె బ్రదుకవచ్చునె యంచు
మెఱుఁగుఁ గెమ్మోవిని విఱచువారు
గీ. మామగారింటిలో నున్న మందెమేల
మెందు దాఁగెనొ యిపు డటం చెన్నువారు
బెళుకుఁ గౌనులు బెళుకంగఁ గులుకువారు
నగుచు నగుచున్న చెలుల కి ట్లనియె శౌరి. 109

గీ. ఇంత కోపము మదినున్నఁ జెంతఁ బిలువఁ
బంచి రాధిక నన్ను దండించ రాదె
వాకిటిన లాకు నను జేయ వశమె వలదు
గౌరవము లాఘవము నెందుఁ గాంచవలదె[2]. 110

క. అన విని రాధిక భావం
బున నించుక కోప మాఱి ముసుఁగిడి తిరుగన్
గని కీరము చని వేగం
బున రమ్మని పిలువ శౌరి ముద మొదవంగన్. 111

  1. కొంచు పొమ్మని బహు ధిక్కరించువారు (తా. ప. ప్ర. పాఠము)
  2. గాన గురులాఘవము నెందుఁ గాంచు ననిన (తా. ప. ప్ర. పాఠము)