పుట:Raadhika Santhvanamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ని న్నంటే మానిసి యై
నిన్నే వెలి సేయఁబూనె నెలఁత బళారే
కొ న్నంగడిలోనే విను
మన్నాఁడే మాఱుబేర మవునే చెలియా. 58

గీ. [1]మాయదారిమాట మది నిజం బని యెంచి
పొలఁతి నమ్మి నానఁబోసికొనియె
తగిలేనా తగిలెను దప్పెనా తప్పెను
నాతి వెఱ్ఱివాని చేతిరాయి. 59

గీ. పడఁతి మును దెల్పనా పదంబదియుఁ గాను
దాని వినయంపుఁ బోకిళ్ళు తగ నెఱింగి
మానిసిని జేయ వలవదు దీనిఁ జేర్చి
తెలియ నిది మేఁకవన్నియపులి యటంచు. 60

వ. అన విని రాధ యిట్లనియె. 61

గీ. దాని నింతయు నన నేల తగవు మాలి
తప్పుతంటల కొడఁబడు దానవారి
ననవలయుఁ గాని తెగనిండ దొనకుఁ దీసి
వేయువాఁ డేయ న మ్మేమి సేయు నమ్మ. 62

క. కలలో నైనను బాయక
కలకాలం బున్న విభుఁడు కసిగాయకు నై
పలుచన చేసె నఁటన్నను
జెలియా మగవారి నెమ్మి చెడ్డది సుమ్మీ. 63

  1. ఈఁక తోఁక లేని శ్రీకృష్ణుమాటలు (ము. ప్ర. పా.)