పుట:Punitha Matha.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిద్ధించాయో శ్రీసభకూ అలాంటి లక్షణాలే సిద్ధిస్తాయి. శ్రీసభ అంటే క్రైస్తవ ప్రజలమైన మనమందరమూను. కనుక మనకందరకూ క్రీస్తు మరియులకు ఒనగూడిన లక్షణాలే ఒనగూడుతాయి. మరియు మహిమలు ఆమెకోసం మాత్రమే గాదు, శ్రీసభ కోసమూ మనకోసమూను. మరియ గుణాలు శ్రీసభలోను మనలోను ఏలా ప్రతిఫలిస్తాయో విచారించి చూద్దాం.

మరియ ఓ మాతృమూర్తి. అదేవిధంగా శ్రీసభకూడ మాత. జ్ఞానస్నానం ద్వారానే శ్రీసభ మనలను కంది. క్రైస్తవుడుకూడ ప్రేషితుడుగా వ్యవహరించినప్పుడల్లా క్రీస్తు బిడ్డలను కంటాడు. తల్లీ తండ్రీ ఔతాడు -గల 4,19.

శ్రీసభ మాతృత్వానికీ మరియు మాతృత్వానికీ ఒక భేదం వుంది. శ్రీసభ క్రీస్తు దేహమైన క్రైస్తవులను మాత్రమే కనగలదు. ఈ దేహానికి శిరసైన క్రీస్తును కనలేదు. జ్ఞాన దేహపు శిరసైన క్రీస్తును కనగల్గిన తల్లి మరియు ఒకరే. అది ఆమె సాధించిన మహాకార్యం. ఆమె మహత్వం కూడ అదే.

నిష్కల్మషుడైన దేవుణ్ణి మన మానుషజాతిలోనికి ప్రవేశపెట్టడం కోసం మరియ నిష్కల్మష కావలసివచ్చిందన్నాం. క్రీస్తు దేహమూ క్రీస్తుపత్నీ ఐన శ్రీసభ కూడ నిష్కల్మష కావాలి -ఎఫేపి 5,27. శ్రీసభ సమస్తంగా తీసికొంటే నిష్కల్మష ఐనా వ్యస్తంగా తీసికొంటే, అనగా తన సభ్యులందు కల్మషగానే వుంటుంది. ఈ సభలో సంపూర్ణ నిష్కల్మష ఒకరే, మరియు కనుక పాపాన్ని జయించి నిష్కల్మషత్వాన్ని బడయడంలో ఆమె మనకూ శ్రీసభకూ ఆదర్శంగా వుంటుంది.