పుట:Punitha Matha.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిమ క్రైస్తవ సమాజం విశ్వసించే సూత్రాలకు భిన్నమైన సూత్రాలను కొన్నిటిని తమ క్రొత్త శాఖల్లో ప్రవేశపెటుకున్నారు. ఈలా ప్రవేశపెట్టుకున్న సూత్రాల్లో ప్రస్తుతం మరియు మాతకు సంబంధించిన అంశాలను మాత్రమే విచారించి చూద్దాం.

లూథరు కాల్విను గూడ మరియమాత దేవమాత అని అంగీక రించారు. ఆమె పవిత్రురాలనీ, నిత్యకన్య అనీ భావించారు. కాల్విను మాత్రం ఆమెకు జన్మపాపం సోకిందన్నాడు. ఆమె ఉత్థాపనాన్ని ఇద్దరూ అంగీకరించ లేదు. ఆమె మనకోసం క్రీస్తును మనవి చేస్తుందనే అంశాన్ని కూడ ఇద్దరూ నిరాకరించారు.

మరియమాత విషయంలో క్యాథలిక్ క్రైస్తవులకి ప్రొటస్టెంటు క్రైస్తవులకి ప్రధానభేదం యిది. ముందటి అధ్యాయాల్లో చెప్పినట్లు క్యాథలిక్ క్రైస్తవులు ఆమె మన రక్షణంలో పాల్గొంది అంటారు. ఆమెను "రక్షణమాత" "సహరక్షక్రి" "మధ్యవర్తిని" అనే పేర్లతో పిలుస్తారు. కాని ప్రొటస్టెంటు క్రైస్తవులు ఈ విషయాన్ని అంగీకరించరు. వీళ్ల భావాలప్రకారం మరియకూడ ఇతర శిష్యుల్లాంటిదే. వాళ్లలాగ ప్రభుకరణ స్వీకరించేదే. ఆమె ప్రభు రక్షణానికి పాత్రురాలైంది అంతే. మరియు వున రక్షణంలో పాల్గొంది అంటే క్రీసు రక్షణం నాశమైపోతుంది. అతడుమనకు మధ్యవర్తి కాకుండాపోతాడు. కనుక మరియ క్రీస్తుతో కలసి మనలను రక్షించింది అనకూడదు. క్రీస్తుతో పనిచేసింది అనాలి. ఆమె క్రీస్తుచెంత నిలచి అతని మధ్యవర్తిత్వానికి సాక్ష్యంగా వుండిపోయింది గాని, తాను స్వయంగా మధ్యవర్తిని కాలేదు.