పుట:Punitha Matha.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బిడ్డను కన్న తరువాత కూడ కన్యగా వుండిపోయిందని బైబులు ఎక్కడా చెప్పదు. కాని అలా వుండిపోలేదని కూడా ఎక్కడా చెప్పదు. సువార్తల్లో పలుతావుల్లో "క్రీస్తు సోదరులు" అనేమాట విన్పిస్తుంది. కాని హీబ్రూభాషా మర్యాద తెలిసినవాళ్లు ఈ "సోదరులు" క్రీస్తుసోంత తమ్ముళ్లు కాదనీ పినతల్లి పెత్తల్లి లేక చిన్నాయన పెదనాయన బిడ్డలని వెంటనే గ్రహిస్తారు. అలాగే “మరియ తొలిచూలు బిడ్డను కంది" అనే ప్రయోగం గూడ ఆమెకు మలిచూలు బిడ్డలున్నారని నిరూపింపదు - లూకా 2,7. "కుమారుని కనేవరకు యోసేఫునకు ఆమెతో శారీరక సంబంధం లేదు" అనే మత్తయి 1.25 వచనం కూడ, క్రీస్తు తరువాత మరియమాతకు మళ్లీ పిల్లలు పుట్టారని రుజువు చేయదు. బైబులు స్పష్టంగా చెప్పదుగాని పారంపర్యంగా వచ్చిన క్రైస్తవ సంప్రదాయం మాత్రం మరియు బిడ్డను కన్న తరువాత గూడ కన్యగానే వుండి పోయిందని చెప్తుంది. అందుకే ఆమెను "నిత్యకన్య" అంటాం.

2. ఆత్మశక్తి

దూత మరియతో "పవిత్రాత్మ నీ మీదికి దిగివస్తుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అంచేత నీకు జన్మింపబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడౌతాడు” అంటాడు -లూకా 1,35. కనుక మరియ పవిత్రాత్మ శక్తి వలన గర్భవతి ఐంది. కాని యిక్కడ పరిశుద్ధాత్మ చేసిందేమిటి? ఆ యాత్మడు పిత సుతుడు అనే దైవ వ్యక్తులను ఐక్యపరుస్తుంటాడు. నరుని దేవునితో జోడిస్తుంటాడు. కనుక ఆ యాత్మడు ఐక్యతాగుణాన్ని ప్రసాదించే దివ్యశక్తి. ఆ దివ్యాత్ముడే రెండవ దైవవ్యక్తియైన వార్తను మరియతో ఐక్యపరుస్తాడు. ఆ దివ్యశక్తి వలననే మరియ గర్భవతి ఔతుంది.