పుట:Puneetha Paul bodhalu 2.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
3. క్రీస్తు అన్నిటికంటె పై విలువ 3,5-11.

పౌలుకి యూదమతంలో వున్నపుడు గొప్పలు చాలవున్నాయి. అతనికి సున్నతి జరిగింది. అతడు ప్రసిద్ధమైన బెన్యావిూను గోత్రీయుడు. హిబ్రూ లేక అరమాయిక్ భాష మాట్లాడేవాడు. యూదుల్లో అగ్రవర్గమైన పరిసయుల శాఖకు చెందినవాడు. క్రైస్తవులను హింసించి పేరు తెచ్చుకొన్నవాడు. ధర్మశాస్తాన్ని ఖండితంగా పాటించి దానివల్ల రక్షణం కలుగుతుందని నమ్మినవాడు ఇవన్నీ అప్పడు అతని గొప్పలు, లాభాలు.

కాని అతడు క్రైస్తవుడు అయ్యూక ఈ లాభాలన్నీ నష్టాలయ్యాయి. క్రీస్తును గూర్చిన అనుభవజ్ఞానంతో పోలిస్తే అతని పూర్వలాభాలన్నీ విలువలేనివి. క్రీస్తుతో పోల్చి చూస్తే ఆ గొప్పలన్నీ చెత్తాచెదారంలాగ, అనగా కసువులాగ నిప్ర్పయోజనమైనవి. కసువుకి ఏమి విలువ వుంటుంది? చిమ్మి అవతలపారేస్తాం గదా! గ్రీకు మూలంలో ఈ "కసువు" అనే పదానికి మలం అని కూడ అర్థం వుంది. అనగా అతని పూర్వపు గొప్పలన్నీ పెంటతో సమానమని అర్థం. క్రీస్తే విలువలన్నిటిలో పై విలువ. ఆ ప్రభువుని సంపాదించు కొంటే చాలు.

నీతి లేక రక్షణం ధర్మశాస్తాన్ని పాటించడంవల్ల రాదు. అది నరులు స్వీయసాధనతో సాధించేదికాదు. దేవుడే దాన్ని ఉచితంగా ఈయాలి. నరుడు క్రీస్తుని విశ్వసించి, అతనిలోనికి జ్ఞానస్నానం పొంది దాన్ని సాధించాలి.

జనుడు రక్షణాన్ని పొందాలంటే క్రీస్తుతో ఐక్యంకావాలి. మొదట అతని శ్రమల్లోను మరణంలోను పాలు పొందాలి. అతనిలాగే మనమూ శ్రమలు అనుభవించాలి. ఆ పిమ్మట అతని ఉత్థానంలో పాలు పంచుకోవాలి. ఇప్పడు పౌలు చేసే కృషి అంతా ఇదే. క్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని సాధించాలని అతని పట్టుదల. అనగా ప్రభువుని అనుభవ పూర్వకంగా, ప్రేమ పూర్వకంగా, తెలిసికోవాలని అతని తపన.