పుట:Pratha Nibandhana Kathalu 2.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీ దేవుడు నా దేవుడు. నీవు వసించే చోటనే నేనూ వసిస్తాను. నిన్ను పాతిపెట్టే చోటనే నన్నూ పాతిపెడతారు అంది. కనుక ఆమెకూడ అత్తతో పాటు యూదయా దేశంలోని బేత్తెహేము నగరానికి వచ్చింది. అప్పడు ఆ దేశంలో యవపంట కోస్తున్నారు.

రూతు జీవనోపాధి కొరకు, పొలాల్లో పరిగలు ఏరుకొంటూండేది. ఒకరోజు బోవసు అనే సంపన్నుని పొలంలోకి ప్రవేశించింది. అతడు ఆమె విదేశీయురాలైన రూతు అనీ, సొంత దేశాన్నీ బంధువులనూ వదలిపెట్టి అత్తపట్ల మమకారం చూపుతుందనీ తెలిసికొన్నాడు. అమ్మా నీవు మా పొలంలోనే కంకులు ఏరుకోవచ్చు. మా పనికత్తెలు దగ్గరే వుండి మా పనివాళ్లు తెచ్చిన నీళ్లు త్రాగవచ్చు. వారితో పాటే నీవుకూడ భోజనం చేయవచ్చు. మా జనమెవరూ నిన్ను బాధించరు అని చెప్పాడు. రూతు కంకులు ఏరుకొని యింటికిపోయి అత్తకు బోవసు తన్ను ఆదరంతో చూచాడని చెప్పింది. నవోమి అతడు మనకు దగ్గరి బంధువు. మన సంగతిని పట్టించుకోవలసినవాడు అతడే అని చెప్పింది. రూతు యవపంట. గోదుమపంట కోసే కాలమంతా బోవసు పొలంలోనే వెన్నులు ఏరుకొంది.

బోవసు పొలంలోనే కళ్లం తొక్కించి ధాన్యానికి కాపలా కాయడానికి రాత్రి అక్కడే పండుకొని వున్నాడు. అత్త ప్రోద్బలంపై రూతు వెళ్లి అతని పాదాల చెంత పండుకొంది. అర్థరాత్రి బోవసు మేల్కొని తన కాళ్ల దగ్గర వున్న స్త్రీని చూచి ఆశ్చర్యపోయాడు. రూతు అయ్యా! నీవు నన్ను కరుణించాలి. నన్ను దేవర న్యాయాన పెండ్లాడి నాకు సంతానాన్ని కలిగించు అని వేడుకొంది. బోవసు ఆమెకు ఆరు కుంచాల ధాన్యమిచ్చి ఇంటికి పంపాడు. మరునాడు పెద్దలను చేరబిలచి వారి సమక్షంలో నేను నవోమి కుటుంబానికి చెందిన ఆస్తిని కొంటున్నాను. రూతుని దేవరన్యాయం ప్రకారం పెండ్లిచేసికొంటాను. ఆమెకు కలిగే సంతానం ఈ కొన్నభూమికి వారసులౌతారు అని చెప్పాడు. పెద్దలు అందుకు సమ్మతించారు. తర్వాత రూతు బోవసులకు ఓబేదు, అతనికి యీషాయి అనే బిడ్డలు పుట్టారు.