పుట:Prasarapramukulu022372mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

71

సంధ్యావందనం శ్రీనివాసరావు :

అనంతపురానికి చెందిన శ్రీ శ్రీనివాసరావు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో తొలినాళ్ళలో పనిచేశారు. చక్కటి కర్ణాటక బాణీలో గానం చేయగల వీరు అనేక భక్తరంజని కార్యక్రమాలు రూపొందించారు. 1994లో వీరు మరణించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రలో వీరు చక్కటి పేరు సంపాదించారు. మదరాసులో మ్యూజిక్ సూపర్‌వైజర్ గా చేరారు. వాద్యగోస్టులు నిర్వహించేవారు. విజయవాడలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. సంగీత కళాశాల (training) మదరాసు ప్రిన్సిపాల్‌గా చేశారు.

సుందరపల్లి సూర్యనారాయణమూర్తి :

క్లారినెట్ విద్వాంసులుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో మూడు దశాబ్దాలు పనిచేసి పదవీ విరమణ చేశారు. యావద్భారత దేశంలో క్లారినెట్ వాద్యసభలద్వారా రసజ్ఞుల మన్ననకు పాత్రులయ్యారు.

సూర్యనారాయణమూర్తి 1931 అక్టోబరు 21న విశాఖపట్టణము జిల్లా చోడవరంలో జన్మించారు. తండ్రి నాగన్న వద్ద క్లారినెట్ నేర్చుకున్నారు. 1957 నవంబరు నుండి 1991 అక్టోబరు వరకు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో క్లారినెట్ కళాకారులుగా వ్యవహరించారు. 1983లో రాష్ట్రసంగీత నాటక అకాడమీ వారు కళాప్రవీణ బిరుదంతో సత్కరించారు.

దత్తాడ పాండురంగరాజు :

పాండురంగరాజుగారు వయొలిన్ విద్వాంసులుగా విజయవాడ కేంద్రంలో పని చేసిన వారిలో ప్రసిద్ధులు. వయొలిన్ వాయిస్తూ వారి స్వగృహంలో కాలధర్మం చెందారు.

N. C. V. జగన్నాథాచార్యులు :

నల్లాన్ చక్రవర్తుల వారి వంశంలో ఎందరో సంగీత విద్య నభ్యసించి ప్రసిద్ధులయ్యారు. అందులో జగన్నాథాచార్యులు గాత్రం ద్వారా బహుళ ప్రశస్తి పొందారు. లలిత సంగీతం ద్వారా, భక్తిరంజని కార్యక్రమాల ద్వారా ఆయన శ్రోతలకు పరిచితులు. వారు హఠాన్మరణం పొందారు. వారి స్మారక సంగీత పోటీలు వారి మిత్రులు ఏటా నిర్వహిస్తున్నారు. వారి సోదరులు నరసింహాచార్యులు ప్రస్తుతం అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా డిల్లీ కేంద్రంలో పనిచేస్తున్నారు. ప్రముఖ రచయిత శ్రీ నిరించి వీరి అన్నయ్య.