పుట:Prasarapramukulu022372mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

69

వార్తా విభాగంలో 15 సంవత్సరాలుగా పనిచేస్తూ విజయవాడ కేంద్రానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తులలో శ్రీప్రయాగ రామకృష్ణ, శ్రీ కొప్పుల సుబ్బారావు ముఖ్యులు. రామకృష్ణ అనౌన్సర్‌గా విజయవాడ కేంద్రంలో చేరి 1979లో న్యూస్ రీడర్ అయ్యారు. చిన్నపిల్లలకు అనేక గ్రంథాలు వ్రాశారు. వ్యాఖ్యాతగా మంచిపేరు తెచ్చుకొన్నారు. ఆధ్యాత్మిక విషయ సంపన్నుడు రామకృష్ణ. కొప్పుల సుబ్బారావు 1976లో ప్రొడక్షన్ విభాగంలోఓ చేరి 1980లో న్యూస్‌రీడర్‌గా మారారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో విశేషంగా దళితులకై కృషి చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే సలహా సంఘ సభ్యులుగా పనిచేశారు.

నండూరి మదన గోపాల రామకృష్ణ :

(N. M. G. రామకృష్ణ)

మధ్యవయసులో విధి కాటు వేసిన వ్యక్తులలో రామకృష్ణ ఒకరు. 1941 మార్చి 27న వైష్ణవ కుటుంబంలో జన్మించిన రామకృష్ణ ఎం. ఏ. పట్టభద్రులయ్యారు. 1963లో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఆకాశవాణిలో చేరి వివిధ కేంద్రాలలో PEXగా పనిచేశారు. విజయవాడలో చాలాకాలం (1975-80ల మధ్య) పనిచేశారు. డెప్యుటేషన్‌పై వార్తా విభాగములో కరస్పాండెంట్‌గా కొంతకాలం (సంవత్సరంన్నర) విజయవాడలో పనిచేశారు. అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌ ప్రమోషన్ వదలుకొని విజయవాడలోనే ఉండిపోయారు. 1981 లో ASDగా రత్నగిరి (మహారాష్ట్ర) వెళ్ళారు. అక్కడనుంచి అదిలాబాదు వెళ్ళారు. 1988లో కొత్తగూడెం కేంద్రానికి తొలిస్టేషన్ డైరక్టర్‌గా వెళ్ళారు. 1991లో హఠాన్మరణం పొందారు. కొత్తగూడెం కేంద్రంలో వీరు రూపొందించిన కిన్నెరసాని రూపకానికి జాతీయస్థాయిలో బహుమతి లభించింది. రామకృష్ణ మంచి రచయిత. వీరి శ్రీమతి విజయవాడ యన్. ఆర్. ఆర్. కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.