పుట:Prasarapramukulu022372mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

39

Y. హనుమంతరావు :

హనుమంతరావు 1938 ఫిబ్రవరిలో కృష్ణాజిల్లాలో జన్మించారు. వ్యవసాయ శాస్త్రంలో బాపట్ల కళాశాలలో పట్టభద్రులై రాష్ట్ర వ్యవసాయశాఖలో పది సంవత్సరాలు డిమాన్‌స్ట్రేటర్ గా పని చేశారు. 1970 ప్రాంతాలలో ఫారం రేడియో రిపోర్టర్‌గా చేరి తర్వాత ఫారం రేడియో ఆఫీసర్‌గా రెండు దశాబ్దాలు విజయవాడ కేంద్రంలో పని చేశారు. మధ్యలో ఆదిలాబాదు, మార్కాపురంలలో కొంతకాలం పనిచేశారు. 1992లో మార్కాపురం కేంద్రం ప్రారంభమయినపుడు తొలి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా రెండేళ్ళు పనిచేశారు. అక్కడినుండి 94 నుండి 96 ఫిబ్రవరి వరకు విజయవాడలో పనిచేసి 96 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. ఈనాడు టి. వి. అన్నదాత కార్యక్రమాల ప్రయోక్తగా హైదరాబాద్‌లో చేరారు. హనుమంతరావు కౌలాలంపూర్ సందర్శించారు. వీరు రూపొందించిన మధుర క్షణాలు, కాంతిరేఖలు రూపకాలు జాతీయస్థాయి బహుమతి పొందాయి.

డా. పుట్టపర్తి నాగపద్మిని :

సుప్రసిద్ద కవి డా|| పుట్టపర్తి నారాయణచార్యుల పుత్రిక నాగపద్మిని. కడపలో 1953 ఆగస్టు 2న జన్మించారు. ఆకాశవాణి కడపలో 1978లో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి వివాహానంతరం హైదరాబాదు కేంద్రానికి బదలీ అయి వెళ్ళారు.1988లో UPSC ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. జానపద వాఙ్మయంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పొందారు. అనేక వ్యాసాలు, కవితలు, రూపకాలు ప్రచురించారు. మూడు గ్రంథాలు ప్రచురించారు. నారాయణాచార్యుల శివతాండవ రూపకాన్ని ప్రసారం చేసి 1993లో జాతీయ స్థాయిలో బహుమతి పొందారు.

జీడిగుంట రామచంద్రమూర్తి :

కథకుడుగా, సినీ రచయితగా పేరుపొందిన జీడిగుంట రామచంద్రమూర్తి 1970లో హైదరాబాదు కేంద్రంలో రచయితగా చేరారు. చాలాకాలం కుటుంబ సంక్షేమ విభాగానికి అనుబంధంగా పనిచేశారు. 1988లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా కడపలో ఒక సంవత్సరంపైగా పనిచేసి 1989లో హైదరాబాదు బదలీ అయ్యారు. 1991 నుండి 6 సంవత్సరాలు నాటక విభాగాన్ని నిర్వహిస్తూ చక్కటి నాటకాలు రూపొందించారు. నవలా రచయితగా జీడిగుంట ప్రసిద్ధులు. చక్కటి వ్యాఖ్యాత.