పుట:Prasarapramukulu022372mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

ప్రసార ప్రముఖులు.

అహమ్మద్ జలీస్ :

జలీస్ 1939 అక్టోబరు 21న హైదరాబాదు నగరంలో జన్మించారు. 1975లో UPSC ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా చేరి మంచి కార్యక్రమ రూపకల్పనలో పేరుతెచ్చుకొన్నారు. హైదరాబాదు 'నయీరంగ్‌' ఉర్దూ కార్యక్రమంలో వెయ్యికార్యక్రమాలు ధారావాహిక ప్రసారం చేసి శ్రోతల మెప్పుపొందారు. రేడియో కాశ్మీర్‌లో పనిచేశారు. 89-91 లో బెంగుళూరు CBSలో ASDగా చేశారు. కడప కేంద్రంలో 91-93 మధ్యకాలంలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ గా చేశారు. 1993 మార్చిలో డిప్యూటీ డైరక్టర్‌గా బెంగుళూరు దూరదర్శన్ కేంద్రంలో చేరారు. దురదృష్టవశాత్తు హృద్రోగంతో 1996 మే 10న బెంగుళూరులో కన్నుమూశారు.

డా. కె. బి. గోపాలం :

గోపాలాచార్యులు 1956 జూన్ 15న తెలంగాణాలో జన్మించారు. యం. యస్. సి. పట్టభద్రులై, పి. హెచ్. డి. పట్టా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందారు. ప్రైవేట్ కళాశాలల్లో కొంతకాలం సైన్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 1986 జనవరిలో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో సైన్స్ ఆఫీసర్‌గా చేరారు. శాస్త్రీయ కార్యక్రమాల రూపకల్పనలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. హైదరాబాదులో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పనిచేశారు. 1993 జూన్ 15న స్టేషన్ డైరక్టర్‌గా అదిలాబాద్ కేంద్రానికి బదిలీ అయ్యారు. సైన్సు వింతలు - విశేషాలు తెలియజేస్తూ అనేక వ్యాసాలు వివిధ పత్రికలలో వ్రాశారు. అనేక గ్రంథాలు ప్రచురించారు. సులభంగా పాఠకులకు సైన్సు విశేషాలు తెలియచేయడం ఆయన ప్రత్యేకత.

డి. ప్రసాదరావు :

ప్రసాదరావు 1951 ఆగస్టు 14న విజయవాడలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం. ఏ. పట్టభద్రులయ్యారు. 1978లో ఆకాశవాణి కడప కేంద్రంలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. UPSC ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయి జగదల్ పూర్, హైదరాబాదు కేంద్రాలలో పనిచేశారు. 1991 లో UPSC ద్వారా స్టేషన్ డైరక్టర్‌గా సెలక్టుఅయి జగదల్ పూర్ కేంద్ర అధిపతి అయ్యారు. అక్కడనుండి 1993 లో విశాఖపట్టణ కేంద్రానికి బదిలీఅయ్యారు. బహుళజనామోదం పొందే కార్యక్రమాల రూపకల్పనలో ప్రసాదరావు సిద్ధహస్తులు.