పుట:Prasarapramukulu022372mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

ప్రసార ప్రముఖులు.

వింత ప్రణయం, యుగసంధి 1957లో, వెల్లువలో పూచిక పుల్లలు 60లో, భవిష్యద్దర్శనం 66లో వెలువరించారు. ఈ నవలల్లో పాశ్చాత్య ప్రభావంలోని ఆస్తిత్వవాదం ప్రస్ఫుటమవుతుంది. భాస్కరభట్ల 1966 నవంబరు 11న కాలధర్మం చెందారు.

కార్యక్రమ నిర్వాహకుడుగా చక్కటి పేరు సంపాదించారు. ప్రసారాలను విశేషంగా రూపొందించారు.

బుచ్చిబాబు 1916-67

శివరాజు వెంకటసుబ్బారావు బుచ్చిబాబుగా ప్రసిద్ధులు. ఈయన 1916 జూన్ 14న ఏలూరులో జన్మించారు. ఎం. ఏ. పట్టభద్రులయ్యారు. రచయితగా ఆయన సుప్రసిద్దులు. పాలకొల్లు, గుంటూరు, మదరాసు, నాగపూర్ లలో విద్యాభ్యాసం చేశారు. 1945 నుండి ఆకాశవాణి మదరాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేశారు. హైదరాబాదు కేంద్రంలో వీరి స్థానం సముచితం. అనంతపురం, విశాఖపట్టణాలలో కాలేజీల్లో ఇంగ్లీషు లెక్చరర్ గా చేశారు. వీరి రచనలలో 1946 లో వ్రాసిన 'చివరకు మిగిలేది' నవల సుప్రసిద్దం. మేడమెట్లు, అడవికాచిన వెన్నెల, కథాసంపుటాలు ఆత్మ వంచన, దారినపోయే దానయ్య, తెరవడని నాటకం, కార్యదర్శి, కల్యాణి, ఉమర్ ఖయ్యాం నాటికలు వ్రాశారు. ప్రాక్ పశ్చిమ సాహిత్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

తండ్రి ఓవర్‌సీర్‌గా ఉద్యోగం చేస్తుండటంతో బుచ్చిబాబు ఆంధ్రదేశంలోని పలుప్రాంతాలు సందర్శించి, నివసించే అవకాశం కలిగింది. ఆ నేపథ్యంలో ఆయన రచనలు గ్రామీణ వాతావరణం ప్రతిబింబిస్తాయి. 1936-67 మధ్యకాలంలో ఆయన ఎన్నో తెలుగు ఇంగ్లీషు రచనలు చేశారు. ఇంగ్లీషు రచనలకు 'సంతోష్ కుమార్‌' అనే కలం పేరుతో వెలువరించారు. షేక్స్‌స్పియర్ సాహిత్య పరామర్శ చక్కటి విమర్శనాగ్రంథం. 40 వ్యాసాల సంపుటిని, 40 నాటికా, నాటకాలను అజ్ఞానమనే వచన కావ్యాన్ని వ్రాశారు. అనుభూతిని కథలలో జొప్పించిన వారిలో బుచ్చిబాబు ప్రథముడు. ఆయన గాయకుడు, నటుడు, చిత్రకారుడు, సాహిత్యకారుడు, సౌందర్యారాధన, మనస్తత్వ చిత్రణ ఆయన కథలలో ప్రస్పుటమవుతుంది.

1967 సెప్టెంబరు 20న బుచ్చిబాబు పరమపదించారు.