పుట:Prasarapramukulu022372mbp.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

21

అనసూయ జానపద సంగీతం ద్వారా ఆకాశవాణికి పరిచితులు. సీత రేడియోలో జానపద సంగీత ప్రయోక్తగా పనిచేసి పదవీ విరమణ చేసింది.

సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసుకొని కృష్ణశాస్త్రిగారు 24-2-80 న పరమపదించారు.

భావ కవిత్వోద్యమానికి ఆయన పెట్టింది పేరు. గిరజాల జుట్టు, మెరుగు కళ్ళజోడు, తెల్లని లాల్చి, పంచె పల్లెవాటుతో ఆయన భావకవికి మారుపేరై నిలిచాడు. దుస్తులలో ఆయన నెందరో అనుకరించారు. 1975లో దేవులపల్లి కవితా స్వర్ణోత్సవం మదరాసులో ఘనంగా జరిగింది.

కళాప్రపూర్ణ బిరుదంతో (1975) ఆంధ్ర విశ్వవిద్యాలయం, పద్మభూషణతో (1976) భారత ప్రభుత్వం సత్కరించాయి. 1978లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి విశిష్ట సభ్యత్వంతో సత్కరించింది.

శాస్త్రిగారి మరణానంతరం వీరి గ్రంథాలు ఆరు సంపుటాలుగా వెలువరించారు. అమృతవీణ, మంగళకాహళి, కవి పరంపర, కవితా ప్రశస్తి, మహావ్యక్తి, అమూల్యాభిప్రాయాలు, ఇంకా 11 సంపుటాల ఆముద్రిత రచనలున్నాయి.

భాస్కరభట్ల కృష్ణారావు (1918-63) :

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన సుప్రసిద్ధ కథారచయిత భాస్కరభట్ల కృష్ణారావు. కథా రచయితగా, నవలా రచయితగా భాస్కరభట్ల లబ్ద ప్రతిష్ఠులు. 1918 డిసెంబరు 19న హైదరాబాదు నగరానికి సమీపంలో ప్రేమాజీపేటలో జన్మించారు. బి.యస్.సీ. పూర్తిచేసి L.L.B. పట్టా పుచ్చుకొన్నారు. 1951 ప్రాంతాలలో ఆకాశవాణిలో చేరారు. దాదాపు 15 సంవత్సరాలు పనిచేశారు.

కథా రచయితగా ఆయన రెండు దశాబ్దాలు (1939-57) పేరు తెచ్చు కొన్నారు. కథా సంపుటులు మూడింటిని ప్రచురించారు. కృష్ణారావు కథల పేరుతో 1955లో పది కథలుసంపుటిగా ప్రచురించారు. రెండోసంపుటి ' చంద్రలోకానికి ప్రయాణం ' అనే పేర 9 కథలు ప్రచురించారు. మూడో సంపుటి వెన్నెలరాత్రిలో 17 కథలు ప్రచురించారు. కథా రచనలేగాక నాలుగు నవలలు కూడా ప్రచురించారు.