పుట:Prasarapramukulu022372mbp.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

19

న్యాపతి కామేశ్వరి (1908-80)

రాఘవరావుగారి ధర్మపత్ని కామేశ్వరి 1908 వ సంవత్సరంలో విజయనగరంలో జన్మించారు. 1932లో విజయనగరం మహారాజా కళాశాలలో పట్టభద్రులయ్యారు. 1937లో ట్రెయినింగ్ లో యల్. టి. ప్యాసయ్యారు. ఉపాధ్యాయ వృత్తిపై ఆమెకు ఎనలేని గౌరవం. మదరాసు నేషనల్ గరల్స్ హైస్కూలులో అధ్యాపక వృత్తిలో చేశారు. బాలలంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ.

రేడియో అన్నయ్యగారితో కలసి బాలానంద సంఘం స్థాపించారు. అవిభక్త మదరాసు రాష్ట్రంలో ఈ సంస్థ బాగా కృషి చేసింది. ఆంధ్ర రాష్ట్రావతరన తర్వాత 1956 లో హైదరాబాదుకు ఈ సంఘం తరలించబడింది. మహిళాభ్యుదయానికి, బాలల విజ్ఞానాభివృద్ధికి బాలానందం ఎనలేని కృషి చేసింది.

1939-56 మధ్యకాలంలో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో బాలల కార్యక్రమ రూపకల్పనలో ఆమె అవిరళ కృషి చేశారు. బాలల కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలు, విద్యా ప్రసారాలు తీర్చిదిద్దడంలో ఆమె కృషి అనన్య సాధ్యం. 1956లో హైదరాబాదు కేంద్రానికి బదిలీ అయివచ్చారు రాఘవరావు దంపతులు. రేడియో అక్కయ్యగా కామేశ్వరి శ్రోతలకు పరిచితురాలు. జంట నగరాలలో రేడియో మహిళా మండలులు స్థాపించడంలో ఆమె కృషి ఎంతైనా ఉంది. తెలంగాణాలోని పల్లెలకు కూడా ఈ ఉద్యమం వ్యాపించింది. రేడియో మహిళామండలుల సమాఖ్యను రూపొందించడంలో ఆమె విశేష కృషి చేశారు. సాంఘిక సంక్షేమ సలహా మండలి సమావేశకర్తగా ఆమె చక్కటి పరిశ్రమ చేశారు.

ఆంధ్ర బాలానంద సంఘం పక్షాన బాలలు పాడుకోవటానికి అనువుగా ఎన్నో పాటలు రచించారు. ప్రముఖ సినీ నటులు నాగయ్యగారి చిత్రం ' నా ఇల్లు ' లో ఆమె ఒక పాత్రను పోషించారు. 1974 ఆమె సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సత్కరించింది. 1969 వరకు మూడు దశాబ్దాలు ఆమె రేడియోలో పని చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలలో 1975లో కామేశ్వరి సన్మానం పొందారు. 1980 అక్టోబరు 23న కామేశ్వరి దివంగతులయ్యారు.

రేడియో అన్నయ్య, అక్కయ్య ఆదర్శ దాంపత్యానికి మారుపేరు.

బాలానంద సంఘం సభ్యులు వారిని విస్మరించలేరు.

బాలలు నిత్య విజ్ఞాన సందీప్తులని వెల్లడించింది ఈ దంపతులే.