పుట:Prasarapramukulu022372mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

ప్రసార ప్రముఖులు.

కాలం 'ఆంధ్రవాణి' తెలుగు వారపత్ర్హిక నిర్వహించారు. చదువు మీద పట్టుదలతో బి.ఎ. డిగ్రీ సంపాదించారు. వీరి ధర్మపత్ని కామేశ్వరి. వివాహం 1931 లో జరిగింది.

ఆకాశవాణిలో రాఘవరావు దంపతులు కార్యక్రమాల నిర్వాహణలో రేడియో అన్నయ్య, అక్కయ్యగా ప్రసిద్దికెక్కారు. 1939లో రాఘవరావు కార్యక్రమ నిర్వాహకుడుగా ఆకాశవాణి మదరాసు కేంద్రంలో చేరారు. బాలల పట్ల ఆయన కపారమైన ప్రేమ. వారి విద్యాసాంస్కృతిక వికాసానికి ఎంతగానో తోడ్పడ్డారు. బాలానంద సంఘం పేర 1940లో ఒక సంస్థను స్థాపించారు. జీవితాంతం ఆ సంస్థ కోసం అహరహం కృషి చేసారు, 'బాల' పత్రిక ద్వారా బాలల సర్వతో ముఖాభివృద్దికి కృషి చేశారు.

ఆకాశవాణిలో బాలబాలికల కోసం దాదాపు వెయ్యి రచనలు చేశారు. నాటికలు, రూపకాలు ఒకటేమిటి ఎన్నో రకాలుగా ప్రసారాలు నిర్వహించారు. రంగస్థలం పైన బాలబాలికలచే ఎన్నో కార్యక్రమాలు రూపొందిచారు. పొట్టిబావ, చిట్టిమరదలు, కొంటిక్రిష్ణయ్య, తాతయ్య, మొద్దబ్బాయి, దొడ్డమ్మ పాత్రల ద్వారా బాలనంద కార్యక్రమాలు రక్తికట్టేలా చూసారు. రాఘవరావు రచించిన 'బడిగంట' రూపకం జాతీయ స్థాయిలో బహుమతి పొందింది. ఆయన కొంత కాలం సెంట్రల్ సోషల్ వెల్‌ఫెర్ అడ్వయిజరీ కమిటీ మెంబరుగా పని చేశారు. బాలల కోసం ఒక సినిమా తీశారు. ఎన్నో గ్రామఫోను రికార్డులు రూపొందిచారు.

చివరిదశలో రాఘవరావు హైదరాబాదులోని నారాయణ గూడలోని బాలానంద సంఘ కార్యాలయంలో ఎంతో ఉత్సాహంగా పని చేశారు. 1984 ఫిబ్రవరి 24 న ఆయన హైదరాబాదులో కాలధర్మం చెందారు. కామేశ్వరితో ఆయనకు అన్యోన్య దాంపత్యం. ఇద్దరూ బాలల కార్యక్రమాలు తీర్చిదిద్దడంలో అహరహం కృషిచేశారు. బాలానంద సంఘ సభ్యులు ఎందరో ప్రసిద్ద కళాకారులయ్యారు. బాలానందంలో పాల్గొనడం ఒక విశిష్టతగా భావించేవారు. బాపు, ముళ్ళపూడి వెంకటరమణ, మోహనకందా వంటి ప్రముఖులు యిందులో సభ్యులు కావడం విశేషం పిల్లల మనస్తత్వాన్ని కనిపెట్టి వారి బుద్ది వికాసానికి కార్యక్రమాలు వినోదాత్మకంగా, విజ్ఞానదాయకంగా తయారుచేసినారు. కళాతృష్ణను పెంపొందించి వారి మనోవికాసనానికి దోహదం చేశారు. ఆయన చిరంజీవి.