పుట:Prasarapramukulu022372mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసార ప్రముఖులు.

11


రమేష్ చౌదరి ఆకాశవాణిలో హిందీ ప్రవచనశాఖ ప్రొడ్యూసర్ గా చేరారు. కొంతకాలానికి డిప్యూటీ ఛీఫ్ ప్రొడ్యూసర్ గా ప్రమోట్ అయి ఢిల్లీ బదలీ అయ్యారు. 1979లో ఆయన ఆ పదవితో పాటు మదరాసు బదలీ అయ్యారు. 1980 సం॥ నవంబరులో మదరాసులో ఆయన పదవీ విరమణ చేశారు. ఆకాశవాణి డైరక్టరేటు జనరల్ కార్యాలయంలో రెండేళ్ళు పనిచేసి మంచి పేరు తెచ్చుకొన్నాడు.

1983 ఏప్రిల్ 30న రమేష్ చౌదరి కాలధర్మం చెందారు.

హిందీ సాహిత్యాకాశంలో ఆయన వినీల ధృవతార.

హైదరాబాదు కేంద్రం

ప్రసారాలు ప్రైవేటు రేడియో కేంద్రం ద్వారా హైదరాబాదు నుండి 1933 లో ప్రారంభమయ్యాయి. 1935లో నిజాం తన ఆధీనంలోకి రేడియో కేంద్రాన్ని తీసుకొని ప్రసారాలు చేయసాగారు. ఆయన 'డెక్కన్ రేడియో' అని నామకరణం చేశారు. తెలుగు ఉర్దూ ప్రసారాలు జరిగేవి. హైదరాబాదు సంస్థానం 1950 ఏప్రిల్ లో భారతదేశంలో విలీనమైన తర్వాత డెక్కన్ రేడియో కేంద్రాన్ని భారత ప్రభుత్వం తీసుకొంది. 1950 ఏప్రిల్ 1 నుండి ఆకాశవాణి ప్రసారాలు మొదలయ్యాయి.

తెలుగుభాషా ప్రసారాలతోబాటు హైదరాబాదు కేంద్రం నుండి ఇతర భాషా ప్రసారాలు కూడా జరుగుతున్నాయి. ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషాలలో వారం వారం ప్రసారాలు చేస్తున్నారు. దాదాపు యాభై సంవత్సరాల చరిత్ర గల ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం అసెంబ్లీ భవనాలకు ఎదురుగా గల 'రాక్ ల్యాండ్స్‌' ఏరియాలో సుందరమైన భవనాలలో నెలకొల్పబడింది. 1988 నుండి ప్రస్తుత నూతన భవనాలలోకి ఆఫీసు బ్లాకు మార్చబడింది. 1995 లో నూతన స్టూడియో కాంప్లెక్సును ప్రారంభించారు.

హైదరాబాదు 'ఏ' కేంద్రంపై ప్రధాన ప్రసారాలు మీడియం వేవ్, షార్ట్‌వేవ్ లపై ప్రసారమవుతాయి. 'బి' కేంద్రం నుండి యువవాణి కార్యక్రమాలు 1970 డిసెంబరు 20 నుండి ప్రసార మవుతున్నాయి. 'సి' కేంద్రం కేవలం వాణిజ్య ప్రసారాలకు పరిమితమైంది. వాణిజ్య ప్రసార కేంద్రం 1971 మార్చి 21న ప్రారంభించారు. దీనికి స్టేషన్ డైరక్టరు హోదా గల అధికారి వున్నారు.